Begin typing your search above and press return to search.

నిమిషంలో 3.18ల‌క్ష‌ల కోట్లు సంపాదించారు!

By:  Tupaki Desk   |   20 May 2019 10:30 AM GMT
నిమిషంలో 3.18ల‌క్ష‌ల కోట్లు సంపాదించారు!
X
నిమిషం.. అర‌వై సెక‌న్లు. ఈ వ్య‌వ‌ధిలో ఎంత సంప‌ద‌ను ఆర్జించ‌గ‌లం? ఇది చ‌ద‌వి.. ఆలోచించే లోపే నిమిషం గ‌డిచిపోతుంది. మ‌రి.. అంత స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోదేశీయ‌ స్టాక్ మార్కెట్లో మ‌దుప‌రులు ఈ రోజు ఎంత మొత్తాన్ని సంపాదించారో తెలుసా? అక్ష‌రాల రూ.3.18ల‌క్ష‌ల కోట్లు.

ఆదివారం సాయంత్రం వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ మొత్తం.. కేంద్రంలో మోడీ ప్ర‌భుత్వం గెలుపు ఖాయ‌మ‌ని.. మ‌ళ్లీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తార‌న్న మాట‌ను చెప్పిన నేప‌థ్యంలో.. ఈ రోజు మార్కెట్లు లాభాల్లోకి దూసుకుపోయాయి. ఈ రోజు ట్రేడింగ్ ప్రారంభ‌మైన నిమిషం వ్య‌వ‌ధిలో మ‌దుప‌రుల సొమ్ము రూ.3.18ల‌క్ష‌ల కోట్లు పెర‌గ‌టం విశేషం.

ఇంత స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో ఇంత భారీగా మ‌దుప‌రుల సొమ్ము పెర‌గ‌టం ఇటీవ‌ల కాలంలో ఇదేన‌ని చెబుతున్నారు. సోమ‌వారం నాటి ట్రేడింగ్ ను సూచీలు ఫుల్ జోష్ తో ప్రారంభ‌మ‌య్యాయి. బాంబే స్టాక్ ఎక్సైంజ్ సెన్సెక్స్ 900 పాయింట్ల‌కు పైనే లాభంతో ట్రేడింగ్ స్టార్ట్ అయ్యింది. దీంతో మార్కెట్లు ప్రారంభ‌మైన నిమిషం వ్య‌వ‌ధిలోనే అన్ని కంపెనీల విలువ భారీగా పెరిగింది. దీంతో.. నిమిషంలో రూ.3.18 ల‌క్ష‌ల కోట్లు మొత్తం పెరిగింది. దీంతో మొత్తం స్టాక్ విలువ 1,49,76,896 కోట్లకు చేరింది. శుక్ర‌వారం మార్కెట్ ముగించే నాటికి కంపెనీల మార్కెట్ విలువ మొత్తం రూ.1,46,58,710 కోట్లుగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ రోజు (సోమవారం) మ‌ధ్యాహ్నం 12 గంట‌ల స‌మ‌యానికి సెన్స్ క్స్ ఏకంగా 1018 పాయింట్లు ఎగ‌బాకింది. నిఫ్టీ 301 పాయింట్లు లాభ‌ప‌డింది. మోడీ మ‌రోసారి పీఎం అవుతార‌న్న సందేశం మార్కెట్ల‌కు ఫుల్ జోష్ లో న‌డిచేలా చేశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.