Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్ల కలకలం!?

By:  Tupaki Desk   |   22 March 2021 10:10 AM GMT
ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్ల కలకలం!?
X
తెలంగాణలో ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ గెలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పట్టభద్రుల్లో ఆగ్రహావేశాలున్న వేళ ఈ సీట్లు టీఆర్ఎస్ గెలవడం కష్టమని అంతా అనుకున్నారు. అయితే బీజేపీ సిట్టింగ్ అయిన రాంచంద్రరావు కూడా ఓడిపోవడం ఆ పార్టీని పునరాలోచనలో పడేసింది.

ఈ క్రమంలోనే బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్రరావు సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ దొంగ సర్టిఫికెట్స్ తో ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించారని.. గూగుల్ పే - పేటీఎంల ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారని రాంచంద్రరావు ఫైర్ అయ్యారు. పీఆర్సీపై లీకులు ఇచ్చి ఉద్యోగులతో ఓట్లు వేయించుకున్నారన్నారు.దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇక తాండూర్ లోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగనోట్ల వ్యవహారం దుమారం రేపుతోంది. వికారాబాద్ జిల్లా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాంమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న తోపాటు తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సైతం దొంగ ఓటు వేశారని ఆయన ఆరోపించారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అమెరికాలో పైలెట్ శిక్షణ పొందిన రోహిత్ రెడ్డి ఇక్కడ ఏం చేయలేదని.. అర్హత లేని చదువుతో ఓటు వేశాడని.. అది దొంగ ఓటు అని విమర్శించారు. దీనిపై ఈసీకి - కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.

తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ ను కలిసి వివరణ ఇచ్చారు. దీంతో ఈ దొంగ నోట్ల వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది.