Begin typing your search above and press return to search.

అక్కడ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది!

By:  Tupaki Desk   |   2 Jan 2017 12:42 PM GMT
అక్కడ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది!
X
నియంత్రణ రేఖ వెంబడి ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉడీ ఉగ్రఘటన, సర్జికల్ స్ట్రైక్స్ అనంతరం జరుగుతున్న సంఘటనలు అన్నీ ఇన్నీ కాదు! ఇప్పటికే సుమారు 300 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిన సంగతి తెలిసిందే. ఈ అప్రకటిత కాల్పులతో ఇప్పటివరకూ 27మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇదే క్రమంలో తాజాగా పాక్ జరిపిన కాల్పుల్లో గురువారం నాడు నియంత్రణ రేఖను ఆనుకొని ఉన్న నూర్ కోటే గ్రామంలో తన్వీర్ అనే 16ఏళ్ల బాలుడు చనిపోయాడు. అయితే ఆ బాలుడి శవాన్ని సమాధి చేయడానికి జరిగిన తంతే కశ్మీరీలు ఎంతటి భయానక పరిస్థితుల్లో జీవిస్తున్నారో, నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియజేస్తున్నాయి.

పూంచ్‌ జిల్లా హవేలీ తాలూకాలో ఉన్న నూర్‌ కోటే గ్రామంలో సరిగ్గా కంచె వెంబడే ఆ బాలుడి కుటుంబానికి ఉన్న పొలం లో ఆ బాలుడి శవాన్ని సమాధి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అయితే శుక్రవారం జనాజా ప్రార్థన ముగిసిన అనంతరం శవయాత్ర బయలుదేరింది. ఇంతలోనే అనుకోని భయానక పరిస్థితి... నియంత్రణ రేఖ వెంబడి పాక్ నుంచి మళ్లీ కాల్పుల మోత! ఈ కాల్పుల హడావిడిలో అంత్యక్రియలు నిర్వహించలేని పరిస్థితి. దీంతో మార్గమద్యలోనే దించేసిన అనంతరం ఆ మత పెద్దలు మసీదులోని మైకు దగ్గరకు వెళ్లి బిగ్గరగా అరవడం మొదలుపెట్టారు. "మీరు మా బాలుడిని కాల్చి చంపారు.. ప్రస్తుతం అతడి అంత్యక్రియలు నిర్వహించాల్సి ఉంది.. మీరు కాల్పులు ఆపండి" అని ఆ మత పెద్ద బిగ్గరగా అరిచారు. అనంతరం కాసేపటికి పాక్ వైపు నుంచి తూటాల వర్షం ఆగింది. తర్వాత ఆ బాలుడి అంత్యక్రియలు నిర్వహించిన గ్రామస్థులు హుటాహుటిన ఆ స్థలం నుంచి వెనుదిరిగారు.

ఈ ఒక్క తాజా సంఘటన చాలు... నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పడానికి. సరిహద్దు గ్రామాల ప్రజలు నిత్యం ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారని స్థానిక ఎమ్మెల్సీ జహంఘీర్ మీర్ మీడియాకు చెప్పారు. కాగా నిత్యం ఇదే పనిమీదున్న పాక్... తాజాగా ఆదివారం ఉదయం కూడా కాల్పులు జరిపింది!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/