Begin typing your search above and press return to search.

రాహుల్ ని ఆగమన్నారు...లోకేష్.. పవన్ సంగతేంటి...?

By:  Tupaki Desk   |   21 Dec 2022 2:59 PM GMT
రాహుల్ ని ఆగమన్నారు...లోకేష్.. పవన్ సంగతేంటి...?
X
సరిగ్గా కరెక్ట్ సమయంలోనే కరోనా ఉనికిని చాటుకుంటోందా.. ఫోర్త్ వేవ్ అని ఎనిమిది నెలల క్రితం వినిపించిన మాట ఇపుడు నిజమవుతుందా. ఏమో కరోనా మహమ్మారి దొంగ దెబ్బ తీసే రకం. కాబట్టి దాని విషయంలో ఎవరూ తక్కువగా ఊహించలేరు. అదే సమయంలో కరోనాను లైట్ తీసుకునే సీన్ లేదు. దానికి ఎదురువెళ్ళే సాహసం అయితే చేయలేరు.

గట్టిగా చూస్తే మరో పదిహేను నెలల్లో దేశంలో లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి వంద రోజులు దాటింది. ఇపుడు రాహుల్ పాదయాత్ర మీద కేంద్రం ఆంక్షలు విధిస్తోంది. కరోనా ప్రోటోకాల్ పాటించి పరిమితమైన సంఖ్యలో యాత్ర చేయాలని కేంద్ర ఆరొగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ సూచిస్తున్నారు. కరొనా టీకాలు తీసుకున్న వారితోనే రాహుల్ యాత్ర చేయాలని కూడా ఆయన పేర్కొంటున్నారు.

అలాగే కరోనా ప్రోటోకాల్ అయిన మాస్కులు, శాంటైజేషన్ వంటివి పాటించాలని, భౌతిక దూరం కూడా మస్ట్ అంటున్నారు. ఈ విధంగా అన్నీ చేస్తూ యాత్ర చేస్తారా లేదా కుదరదు అనుకుంటే జాతి హితం కోసం యాత్రను వాయిదా వేసుకుంటారా మీదే చాయిస్ అంటూ కేంద్ర మంత్రి ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాహుల్ కి రాజస్థాన్ ప్రభుత్వానికి కూడా ఆయన రాశారు. ఇపుడు రాహుల్ ఏం చేస్తారు అన్నదే చూడాల్సి ఉంది అంటున్నారు.

నిజానికి రాహుల్ గాంధీ పాదయాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కంటగింపుగానే ఉంది అంటున్నారు. యాత్ర మీద ఇప్పటికే అనేక విమర్శలు చేస్తున్న బీజేపీ నాయకులు ఇపుడు కరోనా పేరిట ముందు జాగ్రత్తలు అంటూ రాహుల్ పాదయాత్రకే ఎసరు పెట్టబోతున్నారా అన్నది కూడా చర్చగా ఉంది. ఎందుకంటే రాహుల్ యాత్ర కొంప ముంచితే బీజేపీకే నష్టం అన్నది తెలిసిందే. ఆ మధ్యన జరిగిన సర్వేలు అంటే రాహుల్ పాదయాత్ర చేపట్టకమును జరిగిన దాంట్లో కూడా కాంగ్రెస్ కి ఎంపీ సీట్లు 2024లో ఏకంగా 52 నుంచి 150 దాకా పెరగబోతున్నాయని తెలిసింది.

ఇపుడు యాత్ర తరువాత కచ్చితంగా ఆ నంబర్ పెరగడం ఖాయం. ఎపుడైతే 200 సీట్లు కాంగ్రెస్ దక్కించుకుంటుందో యూపీయే మూడు సర్కార్ కేంద్రంలో ఏర్పాటు అయ్యేందుకు అవకాశాలు పూర్తిగా ఉంటాయి. అందుకే యాత్ర మీద బీజేపీ ఎపుడూ నిప్పులు చెరుగుతూనే ఉంది. ఇపుడు హడావుడిగా యాత్ర వాయిదా వేసుకోవమని చెప్పడం వెనక కరోనా ముందు జాగ్రత్తల్తో పాటు తమ రాజకీయ జాగ్రత్తలు కూడా ఉన్నాయా అన్న చర్చ అయితే కచ్చితంగా వస్తోంది.

సరే రాహుల్ విషయం అలా ఉంటే జనవరి 27 నుంచి ఏపీలో టీడీపీ భావి నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర చేపట్టబోతున్నారు. ఆయన యాత్ర ఏకంగా నాలుగు వేల కిలోమీటర్ల దూరం పైగా సాగనుంది. నాలుగు వందల రోజుల పాటు సాగే అతి పెద్ద పాదయాత్ర ఇది. ఈ యాత్ర విషయంలో ఇప్పటిదాకా వైసీపీ నేతలు బయటకు ఏమీ అనలేదు. ఈ యాత్ర చేస్తే కచ్చితంగా వైసీపీకి ఇబ్బందే. పాదయాత్ర పవర్ ఏంటో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి తెలియనిది కాదు.

మరో నెల రోజులు మాత్రమే లోకేష్ పాదయాత్రకు టైం ఉంది. మరి ఆ పాదయాత్రను కూడా వాయిదా వేసుకోవాలని అధికార వైసీపీ సూచిస్తుందా లేక ఆంక్షలతో యాత్ర చేసేందుక్ అనుమతిస్తుందా అన్నది ఆసక్తికరమైన విషయంగా ఉంది. యాత్రకు కండిషన్లు పెడితే మాత్రం లోకేష్ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం ఉండదు, వాయిదా వేసుకుంటే ఎపుడు మళ్లీ అనుమతిస్తారో కూడా చూడాలి. అప్పటికి ఎన్నికలు ముంగిట్లో వచ్చేస్తే లోకేష్ తాను అనుకున్న ప్రకారం పూర్తి యాత్ర కూడా చేయలేరు.

అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర కూడా ముందు ముందు ఉంది. అది కూడా వచ్చే ఏడాది స్టార్ట్ చేస్తారని అంటున్నారు. మరి కరోనా పీక్స్ కి వెళ్తే అపుడు ప్రభుత్వం ఆంక్షలు అమలులోకి వస్తే ఆయన బస్సు యాత్రకు కూడా బ్రేకులు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు. ఈ యాత్రలు అన్నీ విపక్షాలకు చాలా కీలకం. సరిగ్గా ఎన్నికల ఏడాదితో కనుక కరోనా ఫోర్త్ వేవ్ విశ్వరూపం చూపిస్తే దాని వల్ల కొన్ని నెలల పాటు ఎలాంటి రాజకీయ కార్యకలాపాలూ లేకుండా ఉంటే పూర్తిగా అధికారంలో ఉన్న వారికే లాభంగా ఉంటుంది.

అటు కేంద్రంలో బీజేపీ అయితే రాహుల్ పాదయాత్రకు కరోనా పేరిట బ్రేకులు వేయలనుకుంటోంది. మరి ఏపీలో కూడా వైసీపీ అదే చేస్తుందా అన్నది చూడాలి. అయితే దీన్ని పూర్తిగా రాజకీయమైన విషయంగా కూడా ఎవరూ చూడలేరు. కరోనా ప్రపంచంలో అతి పెద్ద నష్టం మిగిలించిన దేశాలలో భారత్ రెండవ స్థ్తానంలో ఉంది ప్రాణనష్టం ఎక్కువగా భారత్ లో జరిగింది. అందువల్ల కరోనా ఆంక్షలను రాజకీయంగా చూసి ఎవరైనా విమర్శించినా లేక మేము పట్టించుకోమని చెప్పినా జనాలు ఊరుకోరు. అది కుదిరే వ్యవహారం కాదు మొత్తానికి ఎన్నికల వేడి దేశంలో బాగా రాజుకున్న వేళ ఫోర్త్ వేవ్ కరోనా ఏ మాత్రం ఉనికి చాటుకున్నా విపక్షాలకు టోటల్ గా ఇబ్బందే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.