Begin typing your search above and press return to search.

కేసీఆర్ చెప్పినా విన్లేదు..ఈటెల మాట పట్టలేదు

By:  Tupaki Desk   |   7 March 2017 4:52 AM GMT
కేసీఆర్ చెప్పినా విన్లేదు..ఈటెల మాట పట్టలేదు
X
దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న మాటను ఫాలో కాని వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందనటానికి తాజా ఉదంతం నిదర్శనం. రాజకీయాల్లో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవటంలో వెనకపడితే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్నను చూస్తే అర్థమవుతుంది. ఐదేళ్ల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరించి.. సొంతిల్లు లేక.. ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూం ఇంటి కోసం సామాన్యుల సరసన క్యూలో నిలుచోవాల్సి వచ్చింది.

పవర్ లో ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనకేసే విషయంలో కాస్త ముందు.. వెనుకా ఆడే వారి పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ ఉదంతం అర్థమయ్యేలా చెబుతుందని చెప్పాలి. 1994-99 మధ్య కాలంలో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అనంతరం ఎన్నికల్లో ఉన్న భూమిని.. ఇంటిని ఖర్చు చేయటం.. ఎన్నికల్లో ఓడిపోవటం అక్కడితో కథ ముగిసింది.

తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో.. కేసీఆర్ సీఎం అయ్యాక ఆయన్ను కలుసుకొని తన పరిస్థితి గురించి చెప్పుకున్నారు. తనను ఆదుకోవాలని కోరారు. బాగన్నవినతిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. ఆయనకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని.. డబుల్ బెడ్రూం ఇంటిని ఇవ్వాలంటూ అధికారుల్ని ఆదేశించారు. అయితే.. పొలం ఇచ్చేందుకు రూల్స్ ఒప్పుకోవని తేల్చేసిన అధికారులతో ఆయనకు సీఎం ఆదేశించినట్లుగా భూమి రాలేదు. ఇక.. డబుల్ బెడ్రూం ఇంటినైనా ఇప్పించాల్సిందిగా కోరుతూ.. ఆర్థికమంత్రి ఈటెలను ఆశ్రయించారు.

దీనికి స్పందించిన ఈటెల బాగన్నకు ఇంటిని కేటాయించాలని జిల్లా కలెక్టర్ కు స్వయంగా ఫోన్ చేసి మరీ చెప్పారు. అయినప్పటికి ఈటెల ఆదేశాలు నేటికీ అమలు కాలేదు. దీంతో.. డబుల్ బెడ్రూం ఇంటి కోసం తాజాగా ఆయన సంగారెడ్డి కలెక్టర్ మాణిక్క రాజ్ కన్నన్ ను కలుసుకునేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికివచ్చారు. సామాన్యుల సరసన క్యూలో నిలుచొన్నారు. తన వరకూ వచ్చే దాకా వెయిట్ చేసిన బాగన్న.. తనకు ఇస్తానన్న డబుల్ బెడ్రూం ఇంటిని ఇప్పించాల్సిందిగా కలెక్టర్ ను కోరారు. యథావిధిగా.. ఆయన విన్నపాన్ని పరిశీలిస్తామని చెప్పి పంపారు. పవర్ లో ఉన్నప్పటికి.. పవర్ పోయిన తర్వాత పరిస్థితులు ఎంతగా మారతాయనటానికి బాగన్న ఎపిసోడ్ లైవ్ ఎగ్జాంఫుల్ అని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/