Begin typing your search above and press return to search.

ఏలూరులో వింత వ్యాధి తగ్గుముఖం.. నేడు 50 కేసులే నమోదు

By:  Tupaki Desk   |   8 Dec 2020 4:00 PM GMT
ఏలూరులో వింత వ్యాధి తగ్గుముఖం.. నేడు 50 కేసులే నమోదు
X
ఏలూరును గ‌డ‌గ‌డ‌లాడించిన వింత వ్యాధి.. త‌గ్గుముఖం ప‌ట్టింది. కార‌ణాలు ఏమిటో కూడా అంతుచిక్క‌ని వ్యాధితో వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఆసుప‌త్రుల పాలైన ఘ‌ట‌న రాష్ట్రంలోనే కాక దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వ‌ర‌కు కూడా ఈ విష‌యం పాకింది. ఉన్న‌ట్టుండి ప్ర‌జ‌లు ఎక్క‌డివార‌క్క‌డే రోడ్ల మీద ప‌డిపోవ‌డం, నోటి వెంట నురుగులు క‌క్క‌డం, చేతులు కాళ్ల‌లో వ‌ణుకు.. భ‌య భ్రాంతుల‌కు గురి కావ‌డం వంటి లక్ష‌ణాలు.. ఏలూరు న‌గ‌రంలో హ‌ఠాత్తుగా క‌నిపించాయి. తొలుత దీనిని ఫిట్స్ అనుకున్నారు. అయితే.. ఆ ల‌క్ష‌ణాలు లేవు. ఇక‌, మెద‌డు వాపు వ్యాధి అనుకున్నారు. సిటీ స్కాన్‌లో ఆ ల‌క్ష‌ణాలు కూడా క‌నిపించ‌లేదు.

దీంతో దీనిని వింత వ్యాధిగా పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభ‌మైన ఈ వింత వ్యాధి సోమ‌వారం ఉద్రుత‌మైంది. దాదాపు 700 మంది ఆసుప‌త్రుల్లో చేరారు. ప్ర‌భుత్వం కూడా యుద్ధ ప్రాతిప‌దిక‌న స్పందించి ఏర్పాట్లు చేసింది. రోగుల నుంచి న‌మూనాలు స్వీక‌రించి హైద‌రాబాద్‌, ఢిల్లీ, పుణే స‌హా.. అన్ని ప్ర‌ముఖ ల్యాబొరేట‌రీల‌కు పంపారు. ఆ ఫ‌లితాలు వ‌చ్చాకే త‌ప్ప అస‌లు ఈ వ్యాధి ఏంటో గుర్తించే ప‌రిస్థితి లేకుండా పోయింది. అయితే.. తొలి రెండు రోజులు గంద‌ర‌గోళానికి గురయ్యారు.. బాధితుల సంఖ్య‌ను పెంచేసిన ఈ వ్యాధి .. మంగ‌ళ‌వారం ఒకింత త‌గ్గుముఖం ప‌ట్టింది. మంగ‌ళ‌వారం కేవ‌లం 50 మాత్ర‌మే ఈ ల‌క్ష‌ణాల‌తో ఇబ్బంది ప‌డ్డారు. ఇక‌, వింత రోగంపై వివిధ సంస్థలు, ప్రభుత్వం నివేదికలు సిద్ధం చేశాయి. బాధితుల శరీరంలో లెడ్ హెవీ మెటల్, నికెల్ పదార్ధాలు ఉన్నట్లు ఎయిమ్స్ నిపుణుల బృందం గుర్తించింది.

తాగునీరు లేదా పాల ద్వారా శరీరంలో చేరి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా వీరి నివేదిక అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. న్యూరో టాక్జిన్స్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. తినే ఆహారం లేదా తాగునీరు లేదా పాలే వింతరోగానికి కారణంగా అనుమానిస్తున్నారు. నాడీ వ్యవస్థపై న్యూరో టాక్జిన్స్ ప్రభావం చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో కంటికి సంబంధించి నల్లగుడ్డు స్పందన తగ్గిన లక్షణాన్ని వైద్యులు గుర్తించారు. వైద్య పరిభాషలో ప్యూపిల్ డైలటేషన్‌గా వైద్యులు పేర్కొంటున్నారు. మయో క్లోనిక్ ఎపిలెప్సీ కావచ్చని గుంటూరు వైద్య నిపుణుల బృందం చెబుతోంది.