Begin typing your search above and press return to search.

ఏలూరులో వింత వ్యాధి...మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యమా?

By:  Tupaki Desk   |   11 Dec 2020 1:46 PM GMT
ఏలూరులో వింత వ్యాధి...మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యమా?
X
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏలూరు ప్రబలిన వింత వ్యాధి వ్యవహారం ప్రపంచస్థాయిలో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి బారిన పడిన రోగుల రక్తంలో మోతాదుకు మించి సీసం, నికెల్ వంటి లోహాలుండడంతోనే వ్యాధిగ్రస్తుల్లో ఆ తరహా లక్షణాలున్నాయని వైద్యులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే, ఈ విషయంపై మరింత పరిశోధన జరుపుతున్నామని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు, నిపుణులు చెబుతున్నారు. మరోవైపు, కలుషిత నీటి వల్లే ఈ వ్యాధి ప్రబలిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే భూగర్భ జల శాఖ అధికారులు ఈ వింత వ్యాధి గురించి చెప్పిన విషయాలు సంచలనం రేపుతున్నాయి. నీటిలో క్లోరిన్ అధికమోతాదులో ఉండడం వల్లే ప్రజలు ఈ వింత వ్యాధి బారిన పడ్డారని భూగర్భ జల శాఖ అధికారులు వెల్లడించారు. ఏలూరులో నీటి శాంపిల్స్ ను పరీక్షించిన భూగర్భ జల శాఖ...తాగు నీటిలో క్లోరిన్ అధికమోతాదులో ఉందని ప్రకటించింది. మున్సిపల్ ట్యాప్ వాటర్ శాంపిల్స్ కూడా పరీక్షించామని, ఆ నీటిలోనూ మోతాదుకు మించి క్లోరిన్ ఉందని వెల్లడించింది. బాధిత ప్రాంతాల్లో 12 చోట్ల శాంపిల్స్ సేకరించి పరీక్షించిన తర్వాతే ఈ ఫలితాలను ప్రకటించినట్లు పేర్కొంది.

దీంతోపాటు మరో సంచలన విషయాన్ని అధికారులు వెల్లడించారు. నీటిని సరఫరా చేసే ట్యాంక్ దగ్గర మద్యం బాటిల్స్ ఉన్నాయని, మద్యం మత్తులో సిబ్బంది నీటిలో క్లోరిన్ ను అధిక మోతాదులో కలిపి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ఏలూరులోని కొన్ని ప్రాంతాల్లో కూరగాయలు, నీరు, పాలు, బియ్యం, నూనె వంటి పలు శాంపిల్స్ ను జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎస్‌) శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఏలూరు, కృష్ణా, గోదావరి కాలువల్లోని నీటిలో హానికరమైన రసాయనాలు, క్రిమి సంహారకాల అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ నీటిలో 17.84 మిల్లీ గ్రాముల మెధాక్సీక్లర్‌ ఉందని, సాధారణంగా 0.001 మిల్లీ గ్రాముల కంటే తక్కువగా ఉండాలని షాకింగ్ విషయం వెల్లడించారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో నీటిలో 17,640 రెట్లు అధికంగా మెధాక్సీక్లర్‌ ఉందని, ఈ తరహా నీటిని తాగడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదముందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మొత్తం వివరాలను సీఎం జగన్ కు అధికారులు , వైద్య నిపుణులు వెల్లడించనున్నారు.