Begin typing your search above and press return to search.

తిరుపతి లో వింత ఘటన .. భూమి నుంచి పైకొచ్చిన వాటర్ ట్యాంక్!

By:  Tupaki Desk   |   26 Nov 2021 5:30 PM GMT
తిరుపతి లో వింత ఘటన .. భూమి నుంచి పైకొచ్చిన వాటర్ ట్యాంక్!
X
ప్రపంచంలోకెల్లా అత్యంత పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి లో ఓ వింత చోటు చేసుకుంది. మనం అనుకోని ఘటనలు.., అస్సలు ఊహించని అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కొందరికి అనుకోని విపత్తులు కూడా ఉత్పన్నం అయిన సందర్భాలు ఎన్నో మనుషుల పై పక్షులు., జంతువులు దాడి చేయడం కూడా అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. ప్రకృతి ప్రకోపానికి ఎవరైనా గురైతే, అలాంటి సంఘటన మనకు ఎదురైతే హార్ట్ ఎటాక్ వచ్చినంత పని అవుతుందనడం సత్యం. ఆధ్యాత్మిక నగరి తిరుపతి లో జరిగిన ఓ సంఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వింత ఘటన జరిగిన ప్రదేశాన్ని చూసేందుకు జనాలు తండోప తండాలుగా చేరుకుంటున్నారు.

నిన్న రాత్రి జరిగిన ఘటన ఆ నోటా ఈ నోటా పడి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గడిచిన వారం రోజులుగా చిత్తూరు జిల్లా ,వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసి జిల్లా వాసుల బ్రతుకులను చిన్నాభిన్నం చేసింది. ఎటు చుసిన జలప్రళయంలో తిరుపతి నగరం మునిగిపోయింది. ఇక తిరుపతిలోని ఎం.ఆర్ పల్లిలో ఎవరూ చూడని అరుదైన వింత ఘటన చోటు చేసుకుంది. స్థానిక శ్రీకృష్ణా నగర్‌లో గురువారం సాయంత్రం మహిళ తన ఇంట్లోని 25 అడుగుల వాటర్‌ ట్యాంక్‌ని శుభ్రం చేయడం ప్రారంభించింది. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇది కలా నిజమా అనిపించేలా.. ఈ వాటర్ ట్యాంక్ భూమి నుంచి పైకి రావడం మొదలైంది. దీంతో ఆ మహిళ ఒక్కసారిగా బిత్తరపోయింది. ఏ జరుగుతుందో అర్ధం కాక కేకలు వేయడం ప్రారంభించింది.

భార్య కేకలు విని ఇంట్లో ఉన్న భర్త బయటకు పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు. జరుగుతున్న ఘటన చూసి అవాక్కయ్యాడు. ఆ షాక్ నుంచి వెంటనే తేరుకొని నిచ్చెన సాయంతో భార్యను బయటకు తీసుకొచ్చాడు. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. 18 ఒరలతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ 11 ఒరల మేర బయటకు వచ్చింది. భూమిలో నుంచి నిటారుగా బయటకు వచ్చిన వాటర్ ట్యాంక్ ను చూసేందుకు చుట్టుపక్కల జనం భారీగా తరలివచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సైతం సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. విషయం తెలుసుకున్న ఎస్వీ యూనివర్సిటీ జియాలజి ప్రొఫెసర్ల బృందం పరిశీలించింది.

దీనిపై అసోసియేట్ ప్రొఫెసర్ మధు మాట్లాడుతూ.., ఇలాంటి సంఘటన రాయలసీమ జిల్లాల్లో జరగటం ఇదే తొలిసారని తెలిపారు. భూమి పొరలలో మార్పు, సంప్ నిర్మాణ సమయంలో నింపిన ఇసుక కాలువ గట్టున ఉన్న ప్రాంతం కావడం, వరద ముంపు.. ఇవన్నీ కలగలపిన అంశాల కారణంగానే సంపు 15అడుగులు పైకి లేచిందని తెలిపారు. దీనివల్ల భయపడాల్సిన పని లేదని, ఇది భూమిలో జరిగే సహజమైన పరిణామమేనని చెప్పారు.