Begin typing your search above and press return to search.

ఆ గ్రామంలో వింత శబ్దాలు.. ఆందోళనలో ప్రజలు

By:  Tupaki Desk   |   26 Nov 2021 11:30 PM GMT
ఆ గ్రామంలో వింత శబ్దాలు.. ఆందోళనలో ప్రజలు
X
అదొక అందమైన పల్లెటూరు. ఇక్కడ ఉండే మనుషులు చాలా స్వచ్ఛంగా ఉంటారు. వారి మనస్తత్వాలు నిర్మలంగా ఉంటాయి. కానీ కొన్ని రోజులుగా వారిని రకరకాల భయాలు వెంటాడుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు కంటి మీద కునుకు లేకుండా ఆ గ్రామంలో బతుకుతున్నారు.

ఏ క్షణం ఏమవుతుందోనని ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. రేయనక, పగలనక వారి భయాలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ఇంతకీ వారి భయం ఎందుకు దానికి గల కారణాలు ఏంటి అనేది ఓ సారి తెలుసుకుందాం.

అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలంలోని ముదిరెబయలు అనే గ్రామంలో ప్రజలు రాత్రింబవళ్లు నిద్రపోకుండా భయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అందుకు గల కారణం ఆకాశం నుంచి వివిధ రకాల శబ్దాలు రావడమే. దీనికి తోడు భూమినుంచి వచ్చే ధ్వనులు వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

రోడ్డు మీద సరిగ్గా నడవాలంటే వారు ఆలోచించే పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఇందుకు కారణం ఆ ఊరిలో భూకంపం వచ్చినట్లు శబ్దాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఆకాశం నుంచి వివిధ రకాల ధ్వనులు వారిని భయపెడుతున్నాయి.

ఇవి కేవలం రాత్రిపూట అని అనుకుంటే పొరపాటే... రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎప్పుడంటే అప్పుడు ఈ శబ్దాలు వినిపిస్తున్నాయి. దీంతో అక్కడ ఉన్న ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఆకాశం విరిగి మీద పడినట్లు పెళ పెళ అనే శబ్దాలు నానాటికి ఎక్కువ ఉండడంతో చిన్న నగరాల నుంచి పెద్దవాళ్ల వరకూ అందరిలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

కొద్ది రోజుల క్రితం వరకు ఎంతో ఆనందంగా సంతోషంగా గడిపిన వీరు ప్రస్తుతం భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడ వినిపించే వింత వింత శబ్దాలు గతంలో ఎప్పుడూ వినిపించలేదని ఆ ఊరిలో నివసించే ముసలి వాళ్లు చెబుతున్నారు. భూమి నుంచి ఆకాశం నుంచి వస్తున్నా శబ్దాలకు రాత్రిపూట జాగారం చేయాల్సి వస్తోందని ఆ ఊరి ప్రజలు చెబుతున్నారు.

ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎందుకు వస్తున్నాయో అనేది తెలియక ఆందోళన చెందుతున్నారు. వీరిలో చాలామంది ఊరు విడిచి వెళ్లివాలనే ఆలోచనలో ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ శబ్దాలపై లోతైన పరిశోధన చేపట్టాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.