Begin typing your search above and press return to search.

పీకే టీంకే తెలుగు పార్టీల మొగ్గు.. రాజ‌కీయాలు మార‌తాయా?

By:  Tupaki Desk   |   26 July 2021 12:30 AM GMT
పీకే టీంకే తెలుగు పార్టీల మొగ్గు.. రాజ‌కీయాలు మార‌తాయా?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీల‌కు వ్యూహాలు కావాలి. అధికారంలోకి వ‌చ్చేసేలా.. మున్ముందు పార్టీల‌ను ఎలా ముందుకు తీసుకువెళ్లాల‌నే విష‌యంలో నాయ‌కులకు సూచ‌న‌లు, స‌ల‌హాలు కావాలి. ఈ క్ర‌మంలోనే ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, అధికార ప‌క్షం.. వైసీపీ, తెలంగాణ‌లో ఇప్పుడే పుట్టిన ష‌ర్మిల పార్టీ వైటీపీ స‌ల‌హాదారుల‌ను నియ‌మించుకున్నాయి. వైసీపీ గ‌త ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందుగానే ప్ర‌శాంత్ కిశోర్ టీంను.. వ్యూహాల కోసం నియ‌మించుకుంది. పీకే చూపిన బాట‌లో న‌డిచి.. అధికారం ద‌క్కించుకుంది. ఈ క్ర‌మంలో.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు టీడీపీ కూడా వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతోంది.

దీంతో రాబిన్ శ‌ర్మ‌ను టీడీపీ స‌ల‌హాదారుగా నియ‌మించుకుంది. అదేస‌మ‌యంలో జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల పార్టీపెట్టి మూడు శుక్ర‌వారాలు కూడా కాక‌పోయినా.. ఆమె కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం.. అధికారం .. కోసం త‌ప‌న చెందుతున్నారు. ఈ క్ర‌మంలో ఆమె ప్రియ అనే మ‌హిళా వ్యూహ‌క‌ర్త‌ను నియ‌మించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఎవ‌రి రాజ‌కీయ ల‌క్ష్యాలు వారికి ఉంటాయి కాబ‌ట్టి.. వ్యూహాల మేర‌కు ముందుకు సాగాలి కాబ‌ట్టి.. నాయ‌కులు ఈ నిర్ణ‌యం తీసుకోవడాన్ని త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయితే.. ఇటు టీడీపీ కానీ, అటు వైటీపీ కానీ.. నియ‌మించుకున్న వ్యూహ‌క‌ర్త‌లు.. పీకే టీంలో స‌భ్యులు కావ‌డం గ‌మ‌నార్హం. వీరు పీకేకు దూరంగా బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంతగా వ్యూహ‌క‌ర్త‌లుగా మారారు.

మ‌రీ ముఖ్యంగా ఏపీలో వైసీపీకి పీకే టీం ఇంకా ప‌నిచేస్తూనే ఉంది. అదేస‌మయంలో పీకే టీం నుంచి వ‌చ్చిన రాబిన్ శ‌ర్మ‌నే టీడీపీ కూడా వ్యూహ‌క‌ర్త‌గా నియ‌మించుకోవ‌డం.. చ‌ర్చ‌కు దారితీసింది. గ‌త ఎన్నిక‌ల కు ముందుగానే రాబిన్‌శ‌ర్మ‌ను నియ‌మించుకున్నా.. ఆ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబే అన్నీ అయి వ్య‌వ‌హ‌రించారు. అయితే.. ఇప్పుడు పూర్తిగా రాబిన్‌కు అవ‌కాశం ఇచ్చి.. పార్టీని ముందుకు తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే కొన్ని రోజుల కింద‌ట పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు టీడీపీ ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. అదేస‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు కూడా పెద్ద ఎత్తున అవ‌కాశం క‌ల్పించారు. ఇక‌, ఇప్పుడు మండ‌లాల వారీగా కూడా పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.

మ‌రోవైపు నాలుగు రోజుల కింద‌ట `డిజిట‌ల్ టీడీపీ` అంటూ మ‌రో వేదిక‌ను తీసుకువ‌చ్చారు. దీనికి కూడా 25 పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. ఇంద‌తా కూడా రాబిన్ శ‌ర్మ వ్యూహ‌మే. అయితే.. ఈ వ్యూహం ఏమేర‌కు వ‌ర్కవుట్ అవుతుంద‌నేది ఆస‌క్తిగా మారింది. అంతేకాదు, ఇటు వైసీపీకి పీకే టీం ప‌నిచేస్తుండ‌గా.. ఆయ‌న శిష్యుడే టీడీపీకి ప‌నిచేయ‌డం.. ఆ వ్యూహాల‌నే అమ‌లు చేయ‌డం.. వంటివి వ‌ర్కువుట్ కావ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇక‌, తెలంగాణ‌లో కేసీఆర్ కూడా వ్యూహ‌క‌ర్త‌ను నియ‌మించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ని.. పీకే అంగీక‌రిస్తే.. ఆయ‌న‌నే తీసుకునే అవ‌కాశం ఉంద‌ని సోష‌ల్ మీడియా వ‌ర‌కు ప్ర‌చారం వ‌చ్చింది. మ‌రి అంద‌రూ పీకే స్కూల్ నుంచే రావ‌డంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు ఎలాంటి మ‌లు పు తిరుగుతాయో .. అనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.