Begin typing your search above and press return to search.

ప్యాకేజీకి ఓకే అనడంలో బాబు వ్యూహం ఇదే!

By:  Tupaki Desk   |   12 Sep 2016 4:13 AM GMT
ప్యాకేజీకి ఓకే అనడంలో బాబు వ్యూహం ఇదే!
X
ఇన్ని రకాలుగా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నా సరే.. చంద్రబాబునాయుడు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి ఎందుకు ఓకే అన్నట్లు! జనం నుంచి తిట్లు వస్తాయని గ్యారంటీగా తెలిసినప్పటికీ చంద్రబాబునాయుడు ప్యాకేజీకి ఓకే చెప్పేసి, ప్రత్యేకహోదా వద్దన్నారంటే అలాంటి ఆలోచన వెనుక అతి భయంకరమైన రాజకీయ వ్యూహం ఉన్నదని జనం అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పుట్టగతులు లేకుండా చేయడానికే చంద్రబాబునాయుడు ఈ విషయంలో చాలా డిప్లమేటిగ్గా వ్యవహరించారని అంతా అనుకుంటున్నారు.

వ్యూహం ఏంటంటే.. భాజపా ఆంధ్రప్రదేశ్‌ లో విస్తరించాలని చూస్తోంది. కాంగ్రెస్‌ పతనం కావడం ద్వారా ఏర్పడిన శూన్యత ఏమైనా ఉంటే దాన్ని భర్తీ చేయాలని అనుకుంటోంది. 2019 ఎన్నికల్లో తమ పార్టీ స్వతంత్రంగా పోటీచేస్తుందని, నేరుగా అధికారంలోకి రాకపోయినా సెకండ్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరిస్తుందని ఆ పార్టీ నాయకులు చాలా మంది కలలు కంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో... భాజపాకు మంచి పేరు రావడం ఎప్పటికైనా తనకు పక్కలో బల్లెంలా మారుతుందని చంద్రబాబు పసిగట్టారు.

హోదా కాకుండా ప్యాకేజీ మాత్రమే ఇచ్చేలా కేంద్రంతో తన పార్టీ మంత్రులతోనే చర్చలు జరిపించి, చివరికి పాపం మొత్తం భాజపాదే అన్నట్లుగా పవన్‌ కల్యాణ్‌ లాంటి వారితో రాళ్లు వేయించి.. ఆ పార్టీని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఈ దెబ్బకు భాజపా పతనం అయిపోతే గనుక.. ఇక ఆంద్రప్రదేశ్‌ లో తనకు వైకాపా మినహా మరో శత్రుపక్షం ఉండకూదని చంద్రబాబునాయుడు అనుకున్నట్లుగా ఉంది. అలాంటి వ్యూహంతోనే చంద్రబాబు ప్యాకేజీకి అనుకూలంగా తన మంత్రులతోనే పైరవీలు చేయించిఉంటారని జనంలో రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి.