Begin typing your search above and press return to search.

ద‌క్షిణాదిపై మోడీ, షాల వ్యూహ‌మేంటి? దంచికొడుతున్న రాజ‌కీయం!!

By:  Tupaki Desk   |   6 July 2022 8:02 AM GMT
ద‌క్షిణాదిపై మోడీ, షాల వ్యూహ‌మేంటి? దంచికొడుతున్న రాజ‌కీయం!!
X
ఉత్త‌రాది రాష్ట్రాల్లో త‌మ‌దైన శైలిలో దూసుకుపోతున్న బీజేపీ నేత‌లు.. తాజాగా ద‌క్షిణాదిపైనా దృష్టిపెట్టార‌నేది వాస్త‌వం. ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. ద‌క్షిణాది రాష్ట్రాల‌పై క‌మ‌ల నాధులు 2010 నుంచి గ‌ట్టిగా పోరాడుతున్నారు. 2011లో తొలిసారి క‌ర్ణాట‌క‌లో క‌మ‌ల వికాసం ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. ఇత‌ర రాష్ట్రాల్లోనూ విస్త‌రించాల‌నేది బీజేపీ వ్యూహం. అయితే.. క‌ర్ణాట‌క‌కు ఆవ‌ల మాత్రం విస్త‌రించ‌లేక పోతున్నారు. కానీ, ఇప్పుడు క‌ర్ణాట‌క త‌ర్వాత‌.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. త‌ర్వాత‌.. ఈ ప్ర‌భావం ఏయే రాష్ట్రాల‌పై ఉంటుంద‌నేది చూడాలి.

ఇక‌, తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. రెండు ఉప ఎన్నికల్లో గెలవడం సహా జీహెచ్ఎంసీలో పలు చోట్ల విజయం సాధించటం, ఆ బీజేపీలో విశ్వాసాన్ని పెంచింది. ఆ రెండు ఉప ఎన్నికల్లోనూ అభ్యర్థికున్న ఫాలోయింగ్ వల్లే గెలుపు సాధ్యపడిందన్న వాదన వినిపిస్తున్నా.. తెలంగాణ జనాలు తమను నమ్ముతున్నారనటానికి ఇదే సాక్ష్యమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ఊపుతోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ గెలిచి.. పాగా వేయాల‌నేది ప్ర‌ధాన వ్యూహంగా క‌నిపిస్తోంది. దీనికి సంబంధించి అనుకూలంగా ఉన్న అన్ని అంశాల‌ను కూడా బీజేపీ నేత‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్నారు.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ నడ్డా సహా కేంద్ర మంత్రి అమిత్‌షా కూడా ఈ మధ్య కాలంలో తెలంగాణలో పర్యటించారు. ప్రధాని మోడీ కూడా ఈ ఏడాది మేలో హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో చేసిన ప్రసంగంలో కేసీఆర్ కుటుంబ పాలనపై విమర్శలు చేశారు. రాజకీయాల్లో నెపోటిజం కారణంగా యువత నష్టపోతోందనీ ప్రస్తావించారు. ఎన్నో ఏళ్ల పాటు ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధి కేవలం ఓ కుటుంబానికే పరిమితం కాకూడదంటూ మండిపడ్డారు. ఇలా తరచు పర్యటనలు చేస్తూ.. టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అనే భావన బ‌ల‌ప‌డేలా వీరు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

దక్షిణాదిలో పార్టీ విస్తరణ, బలోపేతంపై దృష్టి సారించామని.. తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని షా అన్నారు. తెలంగాణతోపాటు పశ్చిమబెంగాల్‌లో కుటుంబ పాలనకు చరమగీతం పాడటమే లక్ష్యమని.. ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ కాషాయ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆయన ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానం ఇప్పుడు రాజకీయవర్గాల్లో కొత్త ఆసక్తి రేకెత్తిస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల నుంచి బీజేపీకి జాతీయస్థాయి నేతలు ఉన్నా.. అధికారం తెచ్చి పెట్టే నాయకులు మాత్రం కనిపించలేదు. కొన్నేళ్లుగా బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో చేదు అనుభవమే మిగిలింది. ఐతే 2019 ఎన్నికల తర్వాత కమలం పార్టీలో కొత్త హోప్ మొదలైంది. తెలంగాణలో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడంతో.. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తున్నట్టు కనిపిస్తున్నట్లు గ్రహించింది. మోడీ, షా ద్వయం తమదైన వ్యూహాలతో.. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ ఉనికిని చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తూ వస్తున్నారు.

ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 129ఎంపీ సీట్లున్నాయి. 2024లో బీజేపీ ఇక్కడ కూడా గెలవాలనే బీజేపీ వ్యూహం కావొచ్చు. కానీ, ఆయా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు బ‌లంగా ఉండ‌డం.. జాతీయ వాదం లేక‌పోవ‌డం.. సెంటిమెంటు.. వ్య‌క్తి రాజ‌కీయాల‌కు పెరుగుతున్న ఆద‌ర‌ణ వంటివి బీజేపీని ఎంత మేర‌కు స‌క్సెస్ చేస్తాయ‌నేది చూడాలి. ఏదేమైనా.. ఉత్త‌రాది ఊపు ఇక్క‌డ రావాలంటే మాత్రం బీజేపీకి క‌ష్ట‌మేన‌నే టాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.