Begin typing your search above and press return to search.

వ్యూహం లేని సేనాని : నాటి వెలుగులేవీ పవన్...?

By:  Tupaki Desk   |   11 Oct 2022 1:30 PM GMT
వ్యూహం లేని సేనాని : నాటి వెలుగులేవీ పవన్...?
X
జనసేనను 2014 మార్చిలో పవన్ స్టార్ట్ చేసినపుడు ఆ పార్టీలో ఒక ఫైర్ కనిపించింది. సరైన సమయంలో పవన్ దిగాడని అంతా అన్నారు. నాడు ఉమ్మడి ఏపీ అడ్డగోలు విభజనని పూర్తిగా ఎండగట్టిన ఒకే ఒక్కడుగా పవన్ని ఆంధ్రులు ఆశగా చూశారు. అయితే అంతటి పవన్ ఆవేశం కాస్తా సరైన వ్యూహం లేక చతికిలపడింది. 2014 ఎన్నికల వేళ కెరటంగా వచ్చిన పవన్ లోని పవర్ మొత్తాన్ని గుంజుకుని నంజుకు తిన్నది టీడీపీ బీజేపీ మాత్రమే. ఆ విధంగా గరిష్ట రాజకీయ లాభాన్ని వారు పొందితే పార్టీ పెట్టి పోటీ చేయకుండా మద్దతుదారుగా సైడ్ క్యారక్టర్ కి పరిమితం కావడం పవన్ చేసిన అతి పెద్ద చారిత్రాత్మకమైన తప్పుగా ఈ రోజుకీ విశ్లేషకులు చెబుతారు.

నిజానికి 2014 ఎన్నికల్లో పోటీ చేస్తే కనుక పవన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న సీన్. కానీ ఆయన ఆ అవకాశాన్ని వాడుకోలేదు. ఇక 2014 నుంచి 2019 వరకూ కూడా ఆయన రాజకీయం దశ దిశ లేకుండా సరైన వ్యూహాలే లేకుండా సాగిపోయింది. ఇక 2017 నాటికి ఆయన బీజేపీ స్నేహాన్ని తెంచుకుని మంచి పని చేశారని, ప్రత్యేక హోదా మీద నిగ్గదీసిన మొనగాడుగా ఉన్నరని అంతా అనుకున్నారు. అయితే అదే బీజేపీకి గుడ్ బై కొట్టిన టీడీపీతో అయినా పొత్తు కొనసగించి ఉంటే 2019 ఎన్నికలు వేరేగా ఉండేవి. టీడీపీ కూడా ఇంతలా నష్టపోయేది కాదు, పవన్ కూడా రెండు చోట్లా ఓడిపోయేవారు కాదు.

కానీ అలా మరో రాంగ్ స్టెప్ కి పవన్ అలా తెర తీశారు. ఇక చూస్తే 2019లో ఓడాక అయినా ఆయన వామపక్షాలతో మైత్రిని కొనసాగించి ఏపీలో బీజేపీ వ్యతిరేక వైసీపీ వ్యతిరేక ప్రజా ఉద్యమాలు చేసి ఉంటే కధ వేరేగా ఉండేది. కానీ ఆయన ఆరు నెలలు తిరగకుండానే బీజేపీతో చేతులు కలిపారు. పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన పార్టీని అన్నీ మరచి కౌగిలించుకున్నారు. పోనీ ఆ బీజేపీతో అయినా ఈ రొజుకీ సరైన నేస్తాన్ని కొనసాగిస్తున్నారా అంటే అదీ లేదు. ఆయన చూపులు టీడీపీ మీద ఉన్నాయని అంటారు.

ఇక వైసీపీ ఓట్లు చీలకుండా చూస్తాను అని చెబుతున్న పవన్ దాని కోసం ప్రత్యేకమైన స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారా అంటే అదీ లేదు. బీజేపీతో కటీఫ్ అన్నది చెప్పరు, టీడీపీతో మైత్రి ఉందో లేదో గుట్టు విప్పరు. ఇలా చల్తీ కా నాం గాడీ అన్నట్లుగానే పవన్ రాజకీయం ఏదో అలా అన్నట్లుగా ఏపీలో సాగుతోంది. దాంతో పవన్ పార్టీ మీద తొలినాటి మోజులు కానీ ఆ ఆకర్షణలు కానీ ఏమీ లేకుండా పోయాయని అంటున్నారు.

ఇపుడు ఎన్నికలు ఏణ్ణర్ధంలోకి వచ్చాక తాపీగా పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టత మీద ఫోకస్ అంటున్నారు. తన పార్టీలోకి చేరికలను కూడా ఆహ్వానిస్తున్నారు. కానీ పవన్ వైఖరిని ఆయన వ్యూహాల లేమిని చూసిన ఇతర పార్టీలలోని సీనియర్లు దూరంగానే ఉంటున్నారు అని అంటున్నారు. పవన్ మీద నమ్మకం లేకనే ఇలా చేస్తున్నారు అని చెబుతున్నారు.

పవన్ సీరియస్ పాలిటిక్స్ చేయడం లేదని ఇప్పటికే చాలా మంది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఒకనాడు మేధావులు, సీనియర్లు, ఎంతోమంది కీలక నేతలు ఉన్న జనసేనలో ఇపుడు పెద్దగా ఎవరూ లేకపోవడానికి కారణం పవన్ వేస్తున్న తడబాటు అడుగులే అని అంటున్నారు. ఆయన ఏపీలో రాజకీయ శూన్యత పూర్తిగా ఉన్నా కూడా గుర్తిస్తున్నారో లేదో తెలియడంలేదు అంటున్నారు.

నిజానికి 2024 ఎన్నికలు కూడా మ‌రో బంగారు అవకాశం, ఏపీలో టీడీపీని వైసీపీని చూసేసిన జనాలకు తాను ఆల్టర్నేషన్ అని గట్టిగా చెప్పి దమ్ముగా జనంలోకి వస్తే పవన్ కి నీరాజనాలు పట్టేవారే. కానీ ఆయన మాత్రం ఎలాంటి యాక్షన్ ప్లాన్ లేకుండానే స్టేట్మెంట్స్ ఇస్తూ పొద్దు పుచ్చుతున్నారు అని అంటున్నారు. ఈ రకమైన పరిణామాల నేపధ్యంలోనే సీనియర్ నేతలు ఎవరూ కూడా జనసేన వైపు తొంగి చూడడంలేదు అని అంటున్నారు.

మరి పవన్ ఇప్పటికైనా తన రాజకీయ రహదారిని సరిచేసుకుంటారా. తనలోని లోపాలను తెలుసుకుని బండిని జోరెత్తిస్తారా అన్నదే చూడాలి. కానీ పొత్తుల కోసం చూస్తూ పొద్దు పుచ్చితే మాత్రం ఏపీ రాజకీయాల్లో జనసేనది సైడ్ క్యారక్టర్ గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.