Begin typing your search above and press return to search.

రెండేళ్ల చిన్నారిని కుక్కలు చంపేశాయ్

By:  Tupaki Desk   |   29 Jan 2016 10:01 AM IST
రెండేళ్ల చిన్నారిని కుక్కలు చంపేశాయ్
X
విశ్వాసానికి ప్రతీకలుగా కుక్కల్ని చెబుతారు. కానీ.. అదే కుక్కలు ఒక చిన్నారిని చంపేసిన దారుణం కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పిచ్చి కుక్కల స్వైర విహారాన్ని అడ్డుకునే విషయంలో అధికారుల నిర్లక్ష్యం ఒక చిన్నారి మరణానికి కారణమైంది. ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం వేముల పల్లిలో చోటుచేసుకుంది.

మరింత దారుణమైన విషయం ఏమిటంటే.. చిన్నారిని చంపేసిన పిచ్చికుక్కల వ్యవహారాన్ని రెండు గంటల తర్వాత కానీ గుర్తించలేకపోయారు. గ్రామానికి చెందిన చిన వెంకటేశ్వర్లు.. వెంకట రమణ దంపతులకు కొడుకు.. కూతురు ఉన్నారు. రెండేళ్ల అనన్య రోజూ మాదిరే ఇంటి బయట ఆడుకుంటోంది. తమ పనుల్లో తల్లిదండ్రులు ఉండిపోయారు. వీధిలో ఆడుకుంటున్న అనన్యపై పిచ్చి కుక్కులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చటమేకాదు.. పాపను పొలాల్లోకి తీసుకెళ్లి ఛిద్రం చేయటం గ్రామస్తుల్ని తీవ్రంగా కలిచి వేసింది.

ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి కనిపించకపోవటంతో ఉలిక్కిపడిన తల్లిదండ్రులు.. పాప కోసం కాలనీ మొత్తం గాలించారు. రెండు గంటల అనంతరం స్థానికుల వెతుకులాటలో కాలనీకి కొద్ది దూరంలో మాగాణి భూముల్లో అనన్య మృతదేహాన్ని గుర్తించారు. తలను తీవ్రంగా చిధ్రం చేసిన కుక్కల కారణంగా ఆ చిన్నారిని గుర్తించలేనంత దారుణంగా ముఖం గాయాలయ్యాయి. రెండు చెవుల్ని కుక్కలు పీకేశాయి. స్వెట్టర్ వేసుకోవటంతో పొట్ట భాగంపై ఎక్కువ గాయాలు కాలేదు కానీ.. మిగిలిన భాగాలు (తల..కాళ్లు.. చేతులు) తీవ్రంగా గాయాలయ్యాయి. కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన రెండేళ్ల అనన్య ఉదంతం ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది.