Begin typing your search above and press return to search.

కోవిడ్ వైరస్ ఎంత మొండిగా బతికేస్తుందంటే..

By:  Tupaki Desk   |   13 Feb 2020 5:30 PM GMT
కోవిడ్ వైరస్ ఎంత మొండిగా బతికేస్తుందంటే..
X
మనిషి ఎంత శక్తివంతుడంటే.. ఏమైనా చేయగలడన్న బడాయి మాటలు బంద్ అయ్యేలా చేసింది కోవిడ్ అలియాస్ కరోనా వైరస్. కంటికి కనిపించని సూక్ష్మమైన వైరస్ మనిషికి భారీ సవాల్ విసరటమే కాదు.. భయంతో ఆగమాగమయ్యేలా చేసింది. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకూ పదకొండువందల మంది కంటే ఎక్కువమందిని బలి తీసుకున్న ఈ మాయదారి వైరస్ ను ఎలా కంట్రోల్ చేయాలన్నది ఒకపట్టాన అర్థం కాని పరిస్థితి.

ఈ వైరస్ మీద ఇప్పటికే పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు పలు ఆసక్తికర అంశాల్ని చెప్పుకొస్తున్నారు. కోవిడ్ మహా మొండి వైరస్ అని.. ఇది ఒక పట్టాన లొంగదంటున్నారు. ఈ వైరస్ చలి తీవ్రత పెరిగే కొద్దీ శక్తివంతమవుతుందని చెబుతున్నారు. సాధారణ వాతావరణంలో తొమ్మిది రోజులు బతికేసే ఈ వైరస్.. చలి తీవ్రత నాలుగు డిగ్రీలుగా ఉంటే మాత్రం ముప్పు భారీగా ఉంటుంది.

అలాంటి సమయాల్లో ఈ వైరస్ ఏకంగా 28 రోజులు బతికే వీలుంది. మైనస్ నాలుగు డిగ్రీల వాతావరణంలో ఈ వైరస్ నెలకు పైగా జీవించే వీలుంది. అదే సమయంలో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదైతే మాత్రం ఇది బతకలేదు. అంటే.. ఎంత ఎక్కువ ఎండ ఉంటే అంత మంచిదన్నమాట. తలుపు హ్యాండిళ్ల మీద.. తలుపుల మీదే కాదు ఇతరత్రా వస్తువల మీదా ఈ వైరస్ ఉంటుందని.. ప్లాస్టిక్.. చెక్క.. నేలపై తొమ్మిది రోజుల వరకూ బతికే వీలుందని చెబుతున్నారు.

కోవిడ్ వైరస్ తీవ్రత పెరిగే కొద్దీ.. దీన్ని ఇలా కంట్రోల్ చేయొచ్చు అంటూ వాట్సాప్ లోనూ.. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున పోస్టులు వస్తున్నాయి. అయితే.. వీటిల్లో చాలావరకూ తప్పేనని చెబుతున్నారు. ఆల్కహాల్ తాగితే వైరస్ తగ్గుతుందన్న మాటలో నిజం లేదని తేల్చేశారు. నిజానికి కోవిడ్ వైరస్ దరి చేరకుండా ఉండాలంటే.. ముందస్తు జాగ్రత్తలే ముఖ్యమని చెబుతున్నారు.

కరోనా వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో తిరిగే వేళలో.. ఫేస్ మాస్క్ తో పాటు.. చేతికి గ్లౌజ్ ఉండాలి.. వాటిని తీసేసిన తర్వాత ఆల్కహాల్ కలిపిన క్లీనింగ్ లిక్విడ్ తో చేతులు.. శరీరాన్ని శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. బ్లీచింగ్.. ఆల్కహాల్ తగలగానే ముప్ఫై సెకన్లతో ఈ మాయదారి వైరస్ చనిపోతుందని గుర్తించారు. ఈ వైరస్ ఒకరిని ఒకరు తాకితే కూడా వ్యాపిస్తుందా? అంటే.. ఇప్పటివరకూ జరిపిన పరిశోధనల్లో గుర్తించలేదు. కాకుంటే ఉమ్మితో మాత్రం వెంటనే వ్యాపిస్తుందని గుర్తించారు. ఈ వైరస్ ఉన్న వారి ఉమ్ము నేల మీద పడితే.. సాధారణ ఉష్ణోగ్రతలు (30 డిగ్రీల సెల్సియస్ లోపు) ఉంటే మాత్రం తొమ్మిది రోజులు బతుకుతుంది. దీంతో.. చుట్టూ ఉండే మనుషులకు నరకం చూపించి.. ప్రాణం పోయే వరకూ తీసుకెళుతుందని చెబుతున్నారు. తుమ్ములు.. దగ్గుతో కూడా ఈ వైరస్ వెంటనే మిగిలిన వారికి సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.