Begin typing your search above and press return to search.

బెజవాడకు రావటం కోసం ఆ ఇద్దరి అనుభవం వింటే నోట మాట రాదంతే

By:  Tupaki Desk   |   4 Feb 2022 4:23 AM GMT
బెజవాడకు రావటం కోసం ఆ ఇద్దరి అనుభవం వింటే నోట మాట రాదంతే
X
బెజవాడ జనసంద్రమైంది. నిఘా వర్గాల అంచనా ప్రకారం నాలుగు లక్షల మంది విజయవాడకు వచ్చారు. అదనంగా రెండు లక్షల మంది బెజవాడకు చేరుకునే ప్రయత్నం చేసి మధ్యలో నిలిచిపోయారు. వారు కూడా వస్తే విజయవాడ పరిస్థితి మరెలా ఉండేదో? ప్రభుత్వ ఉద్యోగులు..ఉపాధ్యాయుల వివరాల్నిస్థానికంగా సేకరించి.. వారి మీద ఖాకీల కన్నేసి.. అడుగు తీసి అడుగు వేసినంతనే ఆంక్షల చట్రంలోకి నెట్టేసినప్పటికీ.. లక్షలాది మంది బెజవాడకు ఎలా చేరుకున్నారు? అన్నది ప్రశ్న.

దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేసినప్పుడు.. ఒక ముగ్గురి అనుభవాలు చెబితే చాలు.. లక్షలాది మంది బెజవాడకు ఎలా చేరుకున్నారో ఇట్టే అర్థమైపోతుంది. ఏది ఏమైనా సరే.. బెజవాడకు చేరుకోవాలి. జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని చెప్పాలి. రాష్ట్ర ప్రజలందరికి నిరసన ర్యాలీతో.. విషయం అర్థమయ్యేలా చేయాలన్న తలంపు లక్షలాది మందిని ఒక చోటుకు చేరేలా చేసింది. ఇందుకోసం కొందరు దెబ్బలు తిన్నారు. మరికొందరు నానా అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు ఒకే గూటి పక్షులు ఒకేచోటుకు చేరినట్లుగా చేరారు. బెజవాడకు చేరుకున్న లక్షలాది మందిలో శాంపిల్ గా ముగ్గురి ప్రత్యక్ష అనుభవం.. వారి మాటల్లోనే చూస్తే..

ఒక మహిళా ఉద్యోగిని ఏం చెప్పారంటే..?

‘‘బుధవారం సాయంత్రం వరకు తిరుపతిలోని స్కూల్లో విధులు నిర్వహించా. అక్కడ్నుంచి నేరుగా రేణిగుంటలోని స్నేహితుల ఇంటికి వెళ్లా. పోలీసుల్ని తప్పించుకోవటానికి బురఖా వేసుకుని రైల్వేస్టేషన్‌కు చేరుకున్నా. అక్కడా పోలీసులు ఉన్నారు. నా స్నేహితురాలి కుమార్తె సాయంతో వికలాంగురాలిలా కుంటుకుంటూ వెళ్లి రైలు ఎక్కా. టాయిలెట్లో దాక్కుని ఉండిపోయా. రైలు కదిలే వరకు బాత్రూం నుంచి బయటకు రాలేదు. రైలు కదిలాకే బయటకు వచ్చా. విజయవాడకు చేరుకున్నా లాడ్జీలలో

కూడా గదులు ఇవ్వలేదు. కొత్తవారికి ఇవ్వద్దని పోలీసులు చెప్పారట. తెలిసిన వారి వద్దకు వెళ్లి.. రాత్రి అక్కడే నిద్రపోయి.. తెల్లారిరోడ్ల మీదకు వచ్చా.. నాలా లక్షల మంది విజయవాడకు చేరుకున్నాం. ప్రభుత్వానికి మా నిరసన గళం వినిపించాం’’

కారుల్లో వచ్చేందుకు ఎన్ని అవస్థలంటే?

‘‘నెల్లూరు నుంచి కారుల్లో బెజవాడకు వద్దామని బయలుదేరాం. పోలీసులు అడ్డుపడి ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. అంతే.. హైవే వదిలేశాం. పల్లెల్లోకి దూరాం. ఒక పల్లె నుంచి మరో పల్లెకు.. అలా బెజవాడకు చేరుకున్నాం. లాడ్జిల్లో పోలీసులు తనిఖీలు చేశారు. దీంతో.. గోడలు దూకి తెలిసిన వారికి ఇంటికి వెళ్లాం. వారింట్లోనే ఉన్నాం. తెల్లారి సభకు వెళదామని షేర్ ఆటోలో వస్తుంటే.. మా ఫోన్లను పోలీసులు లాక్కున్నారు. ఫోన్లో టీచర్ల గ్రూపులు ఉంటే కొందరిని ఆటోల్లో నుంచి దించేవారు.

కొందరిని కదలనీయలేదు. ఎందుకిలా అంటే... పై ఆఫీసర్ల ఆర్డర్ అన్నారు. అందరిని తప్పించుకొని నిరసన స్థలికి వచ్చాం. ఇలాంటి జనాన్ని ఎప్పుడూ చూడలేదు. దారిన పోతుంటే.. పిలిచి మరీ మహిళలు మంచినీళ్లు..మజ్జిగ ఇచ్చారు. ఇలాంటి అనుభవం ఎప్పుడు కలుగలేదు’’

అర్థరాత్రి గుంటూరుకు చేరుకొని..

‘వి.కోట నుంచి 70 మందిమి బయలుదేరాం. కొద్ది మందిమి రైళ్లలో.. మరికొద్ది మంది కార్లలో బయలుదేరాం. బుధవారంఅర్థరాత్రికి గుంటూరుకు చేరుకున్నాం. తెలిసిన వారి ఇళ్లల్లో ఆశ్రయం పొందాం. అక్కడే మా కార్లను వదిలేశాం. ఆర్టీసీ బస్సుల్లో సాధారణ ప్రయాణికుల మాదిరి బెజవాడకు చేరుకున్నాం. మాలో కొందరు పోలీసుల బారికేడ్లు తగిలి గాయపడ్డారు. కొందరు ఆసుపత్రికి వెళ్లి కుట్లు వేయించుకొని మరీ ర్యాలీలో పాల్గొన్నారు. కొందరు కనకదుర్గమ్మ భక్తుల మాదిరి గుడికి వెళితే.. అక్కడి నుంచి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. చివరకు మూడు గంటల ప్రాంతంలో వదిలితే.. అక్కడి నుంచి నేరుగా ర్యాలీ.. బహిరంగ సభలో పాల్గొన్నాం