Begin typing your search above and press return to search.

సెల్ ఫోన్ వాడొద్దని చెప్పడంతో యువతి ఆత్మహత్య

By:  Tupaki Desk   |   19 July 2020 5:56 AM GMT
సెల్ ఫోన్ వాడొద్దని చెప్పడంతో యువతి ఆత్మహత్య
X
లాక్ డౌన్ ప్యభావం కుటుంబ వ్యవస్థపై తీవ్రంగా పడింది. ఆ వైరస్ వ్యాప్తితో మానవ ప్రపంచ జీవన విధానంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం విద్యా వ్యవస్థలు ఇంకా తెరుచుకోకపోవడంతో విద్యార్థులు సెల్ ఫోనే ప్రపంచంగా బతుకుతున్నారు. అదే కుటుంబాల్లో చిచ్చురేపుతోంది. తాజాగా తెలంగాణలో ఈ సెల్ ఫోన్ వలన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటలో జరిగింది.

గ్రామానికి చెందిన ఎంబరి లక్ష్మి, రమేశ్ దంపతుల కుమార్తె మానస (19). నర్సాపూర్‌ మండలం పెద్దచింతకుంట సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. కళాశాల లేకపోవడంతో మానస ఇంట్లోనే ఉంటోంది. కాలక్షేపం కోసం సెల్ ఫోన్ వినియోగిస్తోంది. అయితే గంటల కొద్దీ సెల్‌ ఫోన్‌ తోనే కాలం గడిపేస్తుండటంతో తల్లిదండ్రులకు కోపం వచ్చింది. దీంతో వారం రోజుల కిందట కూతురు మానసను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి సక్రమంగా భోజనం చేయడం లేదు. ఈ క్రమంలోనే శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి చున్నితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

తల్లి లక్ష్మి ఇంటికొచ్చి చూడగా కుమార్తె మానస దూలానికి వేలాడుతూ కనిపించింది. కుమార్తెను అలా చూసి హతాశయురాలైంది. వెంటనే ఆమె స్థానికుల సాయంతో 108 వాహనంలో నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే మానస మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నర్సాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.