Begin typing your search above and press return to search.

సెల్ఫీ మోజులో..ఫ్రెండ్ మునుగుతున్నా ప‌ట్ట‌లేదు!

By:  Tupaki Desk   |   26 Sep 2017 11:13 AM GMT
సెల్ఫీ మోజులో..ఫ్రెండ్ మునుగుతున్నా ప‌ట్ట‌లేదు!
X
చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. సెల్ఫీలే సెల్ఫీలు. ఇక ఆ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న వారు కుర్ర కారైతే... ఆ సెల్ఫీల మోజుకు హ‌ద్దులే ఉండ‌వు. ఈ మోజు ఎంత‌గా త‌గ‌ల‌బ‌డిందంటే... ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోనంత‌గా. కొండ అంచుల్లో, రైలు డోర్‌లో నిల‌బ‌డి సెల్ఫీలు తీసుకుంటూ చేజేతులారా ప్రాణాలు పోగొట్టుకున్న వారిని చూశాం. అయితే ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే ఘ‌ట‌న సెల్ఫీల మోజుకు ప‌రాకాష్టేన‌ని చెప్పుకోవ‌చ్చు. పిలిస్తే... ప‌లికే దూరంలోనే త‌మ స్నేహితుడు నీళ్ల‌లో మునిగిపోతుంటే... సెల్ఫీ మోజులో ప‌డిపోయిన కొంద‌రు కాలేజీ కుర్రాళ్లు అదేమీ ప‌ట్టించుకోకుండానే సెల్ఫీ తీసుకునే ప‌నిలో మునిగిపోయారు. అంతేనా... అస‌లు త‌మ స్నేహితుడు త‌మ వెంటే ఉన్నాడా? లేదా? అన్న విష‌యాన్ని కూడా మ‌రిచిపోయారు. ఇంత‌క‌న్నా దిగ్భ్రాంతి క‌లిగించే అంశం మ‌రొక‌టి కూడా ఉంది. అదేంటంటే... చెరువు నీళ్ల‌లో స్నేహితుడు మునిగిపోతున్న విష‌యం ఆ మిత్రుల‌కు వారు తీసుకున్న సెల్ఫీనే తెలియ‌జేసింది.

ఆక‌తాయి త‌నం - సెల్ఫీ మోజు - నిర్ల‌క్ష్యానికే ప‌రాకాష్ట‌గా నిలుస్తున్న ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... బెంగ‌ళూరు న‌గ‌రంలోని జ‌య‌న‌గ‌ర్ కు చెందిన‌ నేష‌న‌ల్ కళాశాల‌లో ఇంట‌ర్ చ‌దువుతున్న విద్యార్థి విశ్వాస్ పిక్నిక్‌ లో భాగంగా చెరువు నీటిలో మునిగి చ‌నిపోయాడు. అస‌లు ఈ ఘ‌ట‌న ఎలా జరిగింద‌న్న విష‌యానికి వ‌స్తే... ఎన్‌ సీసీ కేడెట్లుగా ఉన్న స‌ద‌రు క‌ళాశాల విద్యార్థుల‌ను తీసుకుని ఆ కాలేజీ ఎన్‌ సీసీ చీఫ్ లోకల్‌ గానే ఓ టూర్ ప్లాన్ చేశాడు. ఈ టూర్‌ లో భాగంగా స్నేహితుల‌తో క‌లిసి విశ్వాస్ కూడా రామ‌న‌గ‌ర జిల్లా క‌న‌క‌పురా స‌మీపంలో ర‌వ‌గొండ్లు బెట్ట‌కు బ‌య‌లుదేరాడు. సేఫ్‌ గానే అక్కడికి చేరుకున్న వీరంతా... అక్క‌డి ఓ చెరువులో ఈత‌కు దిగారు. స‌ర‌దాగా ఈత కొడుతున్న స్నేహితులంతా... చాలా సేపు త‌ర్వాత చెరువు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

అయితే చెరువు నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్న స‌మ‌యంలో స్మార్ట్ ఫోన్ చేత‌బ‌ట్టిన ఓ విద్యార్థి చెరువు గ‌ట్టుకు స‌మీపంలో నీళ్ల‌లోనే స్నేహితుల‌తో క‌లిసి సెల్ఫీలు తీసుకోవ‌డం మొద‌లెట్టాడు. దీంతో అత‌డి మిగిలిన స్నేహితులు కూడా సెల్ఫీలు దిగే ప‌నిలో పూర్తిగా నిమ‌గ్న‌మైపోయారు. ఈ క్ర‌మంలో ఏం జ‌రిగిందో తెలియ‌దు గానీ... వారి వెంట నీళ్లల్లోకి దిగిన విశ్వాస్ మాత్రం వారి వెంటే బ‌య‌ట‌కు రాలేదు. చెరువు గ‌ట్టుకు స‌మీపంలో స్నేహితులంతా సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే... వారికి అతి స‌మీపంలోనే అత‌డు నీళ్ల‌లో మునుగుతూ తేలుతూ ఉన్నాడు. అయితే సెల్ఫీ మోజులో ప‌డిపోయిన అత‌డి స్నేహితుల‌కు అత‌డి ఆర్త‌నాదాలు ఏమాత్రం వినిపించలేదు. అప్ప‌టికే నీటిలో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు నానా తంటాలు ప‌డుతున్న విశ్వాస్‌... స్నేహితుల నుంచి చేయూత ల‌భించ‌క నీటిలోనే మునిగి ప్రాణాలు వ‌దిలేశాడు.

అయితే సెల్ఫీ మోజులో మునిగిపోయిన అత‌డి స్నేహితులు ఈ విష‌యాన్ని అస‌లు గుర్తించ‌నే లేదు. సెల్ఫీలు తీసుకున్న త‌ర్వాత ఒడ్డుకు చేరి త‌మ స‌రంజామా తీసుకుని అక్క‌డి నుంచి బ‌య‌లుదేరిపోయారు. ఈ క్ర‌మంలో ఆ బృందంలోని ఓ విద్యార్థి తాము తీసుకున్న సెల్ఫీలను చూస్తూ న‌డుస్తున్నాడ‌ట‌. స‌ద‌రు సెల్ఫీల్లో ఓ దానిలో విశ్వాస్ నీటిలో మునిగిపోతున్న దృశ్యం కూడా రికార్డైంది. అంతే... షాక్ తిన్న ఆ విద్యార్థి విష‌యాన్ని ఎన్‌ సీసీ మాస్ట‌ర్‌ కు చెప్ప‌డంతో విద్యార్థుల‌ను లెక్క పెట్టగా... విశ్వాస్ గ‌ల్లంతైన విష‌యం బ‌య‌ట‌ప‌డింది. వెంట‌నే చెరువు ద‌గ్గ‌ర‌కు ప‌రుగులు పెట్ట‌గా... అప్ప‌టికే విశ్వాస్ చెరువు నీటిలో మునిగి ప్రాణాలు కూడా వ‌దిలాడు.

ఊహించ‌ని ఈ షాకింగ్ ప‌రిణామంతో పోలీసులకు స‌మాచారం ఇవ్వ‌గా... చాలా సేపు గాలించిన త‌ర్వాత గానీ విశ్వాస్ మృత‌దేహం ల‌భించ‌లేద‌ట‌. సౌత్ బెంగ‌ళూరులోని ఓ ఆటో రిక్షా కార్మికుడి కుమారుడైన విశ్వాస్ మృతిపై అత‌డి కుటుంబ స‌భ్యులు కళాశాల యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హరించిన కార‌ణంగానే అత‌డు చ‌నిపోయాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా పోలీసుల‌కు ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘ‌ట‌న‌లో సెల్ఫీ మోజులో ప‌డి విద్యార్థులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారా? లేదంటే కుట్ర కోణ‌మేదైమా ఉందా? అన్న కోణంలో ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఏదేమైనా... ప్రాణాల‌ర‌చేతిలో పెట్టుకుని స్నేహితుడు చేస్తున్న ఆర్త‌నాదాల‌ను ప‌ట్టించుకోని సెల్ఫీ మోజు కుర్రాళ్లకు చెందిన ఈ ఉదంతం నిజంగానే షాకింగే అని చెప్ప‌క త‌ప్ప‌దు.