Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా అన్నందుకు పబ్లిక్ గా కొట్టారు

By:  Tupaki Desk   |   2 Nov 2015 6:07 AM GMT
ప్రత్యేక హోదా అన్నందుకు పబ్లిక్ గా కొట్టారు
X
రాష్ట్ర విభజన విషయంలో ఇప్పటికే విపరీతమైన అసంతృప్తిలో ఉన్న సీమాంధ్రులు.. విభజన సందర్భంగా తమకిచ్చిన ప్రత్యేక హోదా అమలు విషయంలో కేంద్ర.. రాష్ట్రాలు పట్టనట్లుగా ఉండటం మంట పుట్టిస్తోంది. ఆత్మహత్యల రూపంలోనో.. నిరసనల రూపంలోనో తరచూ ఈ నినాదం బయటకు వస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ పై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సానుకూలంగా స్పందించాల్సి ఉంది. ఈ విషయంలో ఎవరు ఏమన్నా.. కేంద్రంలోని మోడీ సర్కారు మనసు కరిగితే కానీ విభజన సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ అమలు కాని పరిస్థితి.

ఈ నేపథ్యంలో బీజేపీ మీద ఒత్తిడి పెంచేందుకు వీలుగా ఏపీ విద్యార్థి యువజన జేఏసీ నేతలు ఆదివారం విజయవాడలోని బీజేపీ కార్యాలయం ఎదుట నిరసన నిర్వహించారు. కేంద్రంలో నేరుగా.. రాష్ట్రంలో మిత్రుడి సాయంతో అధికారం చలాయిస్తున్న కమలనాథులకు తాజా నిరసన విపరీతమైన కోపాన్ని కలిగించింది. ప్రత్యేక హాదా విషయంలో ఏపీ ప్రజల కంటే కూడా పార్టీ విధానానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న వారికి.. తమ కార్యాలయం ఎదుటే నిరసన చేస్తారా? అన్న అగ్రహం కలిగించింది. ఎంతైనా అధికారంలో ఉన్నప్పుడు ఆ మాత్రం అగ్రహం తప్పదేమో.

అందుకే.. తమ పార్టీ ఆఫీసు ఎదుటకు వచ్చి నిరసన చేస్తున్న నిరసనకారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీడియా కెమేరాలు ఉన్న విషయాన్ని లైట్ తీసుకున్నారు. కనిపించిన వారిని కనిపించినట్లుగా కొట్టేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఊగిపోతున్న వారిని తిట్టేస్తూ.. తమ ‘కండ’బలాన్ని ప్రదర్శించారు. సీమాంధ్రులకు శత్రువు ఎక్కడో లేరని.. ఇంట్లోనే ఉన్నారని తేల్చేశారు. విభజన సమయంలో కాంగ్రెస్ నేతలు సీమాంధ్రుల సంక్షేమానికి సమాధి కడితే.. ప్రత్యేక హోదా విషయంలో సొంత పార్టీపై ఒత్తిడి తేలేని సీమాంధ్ర బీజేపీ నేతలు తమ చేతకానితనాన్ని.. ఆవేశంతో ప్రత్యేకహోదా కోసం ఉద్యమిస్తున్నవారిపై ప్రదర్శించారు.

పార్టీ ఆఫీసు ముందు నిరసన చేస్తే మాత్రం.. కొట్టేస్తారా? అన్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరించారు. ఒకవైపు.. ప్రత్యేక హోదా కోసం నినదిస్తున్న వారికి కొట్టేస్తున్నా పట్టించుకోని పోలీసులు.. తమ కార్యాలయం ఎదుటకు వచ్చి గొడవ చేస్తున్నారన్న ఫిర్యాదుతో విద్యార్థి నేతల్ని అదుపులోకి తీసుకోవటం గమనార్హం. అధికారంలో ఉన్న వారి నోటి వెంట మాట వచ్చిన వెంటనే చిత్రంగా.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోవటం గమనార్హం.