Begin typing your search above and press return to search.

నయా ప్రొటెస్ట్...ధర్నాకు మద్దతు కోసం ధర్నా

By:  Tupaki Desk   |   8 Feb 2020 9:50 AM GMT
నయా ప్రొటెస్ట్...ధర్నాకు మద్దతు కోసం ధర్నా
X
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ఇప్పుడు కొత్త తరహా ఉద్యమం ఎంట్రీ ఇచ్చిందనే చెప్పాలి. అమరావతి పరిరక్షణ కోసం అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలకు పెద్దగా మద్దతు దక్కలేదనే చెప్పాలి. టీడీపీ వెన్నుదన్నుగా నిలుస్తున్న ఈ నిరసనలకు జనసేన - వామపక్షాలు - బీజేపీలోని ఓ వర్గం మినహా పెద్దగా మద్దతు దక్కలేదనే చెప్పాలి. ఈ ధర్నాకు సినీ పరిశ్రమ నుంచి అసలు మద్దతే దక్కలేదు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో కొనసాగుతున్న ఈ ఉద్యమం వైపు కన్నెత్తి చూసే స్టారే కనిపించడం లేదు. దీంతో సినిమా స్టార్లను తమ ఉద్యమంలోకి తీసుకువచ్చేందుకు అమరావతి పరిరక్షణ సమితి ఓ కొత్త తరహా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది.

రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి తెలుగు సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సీపీఐ నేతలు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ ప్రముఖులకు నిరసనకారులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ - ఏపీలో గత యాభై రోజులకు పైగా రైతుల ఉద్యమం కొనసాగుతోందని - ఆ ఉద్యమానికి సినీ పరిశ్రమ కూడా మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేనా... అసలు సినీ పరిశ్రమ అమరావతి పరిరక్షణ ఉద్యమానికి ఎందుకు మద్దతుగా నిలవాన్న కారణాలను కూడా ఈ సందర్భంగా రామకృష్ణ తనదైన శైలిలో ప్రస్తావించడం గమనార్హం.

ప్రజల తరఫున నిలబడే బాధ్యతను కవులు - కళాకారులు - సాంస్కృతిక బృందాలు తీసుకోవాలని - అందుకే, సినీ పరిశ్రమ కూడా మద్దతు తెలపాలని కోరుతున్నామని రామకృష్ణ అన్నారు. ఏపీలో ఎనభై నాలుగు శాతం మంది ప్రజలు రాజధానిగా అమరావతే ఉండాలని కోరుకుంటున్నారని, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సీఎం జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.రాజధానిని తరలించవద్దని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సినీ పరిశ్రమ ముందుకు రావాలని కోరుతున్నామని చెప్పారు. సినీ పరిశ్రమకు వస్తున్న ఆదాయంలో అరవై ఐదు శాతం ఆంధ్రా ప్రాంతం నుంచే వస్తోంది కనుక తమ అండగా నిలబడమని కోరుతున్నామని అన్నారు. మరి ఈ కొత్త తరహా ధర్నాకు సినీ పరిశ్రమ మద్దతు పలుకుతుందో - లేదో చూడాలి.