Begin typing your search above and press return to search.

ఇవాంకాకు వ్య‌తిరేకంగా సైబ‌రాబాద్ గొంతెత్తిందిగా

By:  Tupaki Desk   |   29 Nov 2017 4:48 AM GMT
ఇవాంకాకు వ్య‌తిరేకంగా సైబ‌రాబాద్ గొంతెత్తిందిగా
X

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య ఇవాంకా ట్రంప్‌ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లోఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. ఇటు ఆన్ రోడ్‌లో - అటు ఆన్‌ లైన్‌లో ఇవాంకా టూర్ నేప‌థ్యంలో నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. ఇవాంకా వెనక్కి వెళ్లిపో... అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ తెలంగాణ ప్రజాఫ్రంట్‌ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌ రాకను వ్యతిరేకిస్తూ టీపీఎఫ్‌ - టీవీవీ - టీవీఎస్‌ - చైతన్య మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది.

మ‌రోవైపు ఇవాంకా హైదరాబాద్‌ పర్యటనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, హైదరాబాద్‌ నగరంలో మహామహులు స్వాగతిస్తుంటే.. ఐటీ ఉద్యోగుల్లో మాత్రం నిరసన స్వరాలు వినిపించాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ ఆంక్షలతో అటు అమెరికాలోనూ, ఇటు ఇండియాలోనూ ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్న నేపథ్యంలో సైబరాబాద్‌ గుండె మండింది. ఇవాంకా భాగ్యనగరిలో అడుగుపెడుతున్న వేళ ఇవాంక గో బ్యాక్‌ నినాదం సామాజిక మాధ్యమంలో హల్‌చల్‌ చేస్తోంది. దీనికి నెటిజన్లు మద్దతుపలుకుతుండ‌టం గ‌మ‌నార్హం. గత వారమే 'ప్రొటెక్ట్‌ అండ్‌ గ్రో అమెరికన్‌ జాబ్స్‌ యాక్ట్‌ (హెచ్‌ఆర్‌170)'కు అమెరికన్‌ కాంగ్రెస్‌ హౌస్‌ జ్యుడిషియరీ కమిటీ ఆమోద ముద్ర వేసిన సంగ‌తి తెలిసిందే. హెచ్‌1బి వీసాలతో అమెరికా వెళ్తున్న ఇండియన్ల ఉద్యోగాలకు ఈ చట్టం ఒక మరణ శాసనమ‌ని వార్త‌లు వ‌చ్చాయి. మరోవైపు గత ఏడాది కాలంలోనే సుమారు లక్షమంది ఐటీ ఉద్యోగులను దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలు తొలగించినట్టు అంచనా. ఇదంతా ట్రంప్‌ ఎఫెక్ట్ అనే సంగ‌తి తెలిసిందే.

ఇండియాలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి ప్రారంభమయ్యాక ఉద్యోగుల సంఖ్య నికరంగా తగ్గడం ఇప్పుడే. 'ట్రంప్‌ ఎఫెక్ట్‌'ను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. ఈ నేప‌థ్యంలో `ట్రంప్‌ అమెరికన్ల ఉద్యోగాలను కాపాడుతున్నప్పుడు నరేంద్ర మోడీ భారతీయుల ఉద్యోగాలకు భద్రత ఎందుకు కల్పించరు` అని 'ఫర్‌ ఐటీ' సంస్థ ప్రశ్నిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాంకా పేరుతో హ‌డావుడి కొన‌సాగుతుండ‌గా... `ఇవాంకా గో బ్యాక్‌` నినాదాన్ని ఇచ్చింది ఫర్‌ ఐటి (@For_IT) సంస్థ. ఇవాంకా అడుగు పెట్డానికి ముందు సైబరాబాద్‌ ఐటీ ఉద్యోగులు ఈ నినాదాన్ని అందుకొని త‌మ ఉద్యోగాలు పోకుండా కాపాడాల‌ని ఆన్‌ లైన్‌లో పోస్టులు వైర‌ల్ చేశారు.