Begin typing your search above and press return to search.

అమెరికాలో వీసా త‌ల‌నొప్పులు వ‌దిలేదిలా

By:  Tupaki Desk   |   10 Feb 2016 5:30 PM GMT
అమెరికాలో వీసా త‌ల‌నొప్పులు వ‌దిలేదిలా
X
అగ్ర‌దేశం అమెరికా తీపిక‌బురు తెలిపింది. ఇటీవ‌లి కాలంలో విద్యాభ్యాసం, ఉద్యోగం కోసం వ‌చ్చే ప్ర‌వాసీయుల‌ను ముఖ్యంగా భార‌తీయుల‌ను పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టిన అమెరికా మన‌సు మార్చుకుంది. తాము తీస్కున్న‌ విప‌రీత నిర్ణ‌యాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చెడ్డ‌పేరు తెచ్చిన నేప‌థ్యంలో వాటిని స‌మీక్షించుకున్న అంకుల్ శ్యామ్ రాజ్యం త్వ‌ర‌లో కొత్త వీసాలు ఇవ్వ‌నుంది.

అమెరికా డిప్లొమాటిక్ మిష‌న్ భార‌త డిప్యూటీ క‌మిష‌నర్ మైకెల్ పెలెట్రీర్ ఈ వివ‌రాలు తెలిపారు. త్వ‌ర‌లో చ‌దువుకోసం వీసాకు ద‌ర‌ఖాస్తు చేసుకునే ప్ర‌క్రియ‌ను త‌మ దేశం ప్రారంభించ‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. కొత్త‌వారే కాకుండా ఇటీవ‌ల వీసాల తిర‌స్కృతికి గురైన వారు సైతం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని మైకెల్ తెలిపారు. అయితే వీసా జారీకి చేసే ద‌ర్యాప్తుతో పాటు వీసా చార్జీల భారం కూడా అధికంగా ఉంటుంద‌ని, అందుకోసం త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని మైకెల్ స్ప‌ష్టం చేశారు. లేదంటే గ‌తంలో ఎదురైన అనుభ‌వాలే ఈ ద‌ఫా కూడా విద్యార్థులు ఎదురుకోక త‌ప్ప‌ద‌ని మైకెల్ హెచ్చ‌రించారు.

అమెరికాలో విద్యాభ్యాస వీసాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునే ప‌లు అంశాల‌ను మ‌న‌సులో పెట్టుకోవాల‌ని మైకెల్ సూచించారు. తాము చేర‌బోయే కాలేజీ, తాము నివ‌సించ‌బోయే ప్రాంతం, త‌మ కోర్సు విష‌యంలో స్ప‌ష్టత‌తో ఉండాల‌ని కోరారు. విద్యాభ్యాసం విష‌యంలో అమెరికా అన్ని దేశాల ప‌ట్ల సానుకూల దోర‌ణితో ఉంద‌ని పేర్కొంటూ భార‌త‌దేశం విష‌యంలో మరింత శ్ర‌ద్ధ చూపిస్తోంద‌ని ప్ర‌క‌టించారు. గ‌త ఏడాది 29% విద్యార్థులు అధికంగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌న‌మని తెలిపారు. సో కంట్రీ ఆఫ్ మైగ్రెట్స్‌కు వెళ్లాల‌నుకునే వారు అన్ని జాగ్ర‌త్త‌ల‌తో రెడీ అవండి మ‌రి.