Begin typing your search above and press return to search.

ఇక్కడకు వచ్చాకే చేతిలో గులాబీ.. షాకిచ్చేలా విద్యార్థి వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   4 March 2022 4:08 AM GMT
ఇక్కడకు వచ్చాకే చేతిలో గులాబీ.. షాకిచ్చేలా విద్యార్థి వ్యాఖ్యలు
X
ఉక్రెయిన్ - రష్యా మధ్య యుధ్దం జరుగుతున్న వేళ.. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థుల్ని స్వదేశానికి తరలించేందుకు మోడీ సర్కారు అనుసరించిన విధానంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఆపరేషన్ గంగా ప్రోగ్రాంలో భాగంగా ఇప్పటివరకు దేశానికి 18 వేల మందిని కేంద్రం తీసుకొచ్చింది. తాజాగా గురువారం ఒక్క రోజునే 17 విమానాల్లో 3726 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లుగా కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది.

గడిచిన 24 గంటల వ్యవధిలో 3 వేల మంది భారతీయులు 15 విమానాల ద్వారా తీసుకొచ్చారని చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. స్వదేశానికి వచ్చిన విద్యార్థుల్ని ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రులు స్వాగతం పలకటం.. వారి చేతికి గులాబీ పువ్వులు పెట్టటం లాంటివి చేస్తున్నారు. కొందరు ఈ పరిణామానికి హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. మరికొందరు మాత్రం కేంద్రం తీరును తిట్టిపోస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. యుద్ధ వాతావరణంలో సరైన సమయంలో.. సరైన రీతిలో స్వదేశానికి తీసుకురావటంతో కేంద్రం సరిగా స్పందించలేదన్న వాదనను వినిపిస్తున్నారు.

తాజాగా బీహార్ కు చెందిన దివ్యాన్షు సింగ్ అనే విద్యార్థి ఉక్రెయిన్ నుంచి హంగేరికి వెళ్లి.. అక్కడ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో అతడు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు. ఉక్రెయిన్ లోని భారతీయులకు భారత ఎంబసీ ఏ విధంగా సాయం చేసిందన్నప్రశ్నకు స్పందిస్తూ మండిపడ్డాడు. ుక్రెయిన్ దాటి హంగేరికి చేరుకున్న తర్వాతే తమకు సాయం అందినట్లుగా చెప్పారు. అంతకు ముందు తమకు ఎలాంటి సాయం అందలేదని పేర్కొన్నారు. అన్నీ తమకు తామే ఏర్పాట్లు చేసుకున్నట్లు వెల్లడించారు.

తాము పది మందిమి కలిసి ఒక జట్టుగా మారి.. రైలు ఎక్కామని.. కిక్కిరిసిన రైల్లో ఎవరూ తమను ఇబ్బంది పెట్టలేదన్నారు. స్థానికుల నుంచి తమకు చాలా సాయం అందినట్లు చెప్పారు. అయితే.. పోలెండ్ సరిహద్దుల్లో మాత్రం కొందరు విద్యార్థులు వేధింపులు ఎదుర్కొన్న మాట వాస్తవమన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యతగా పేర్కొన్నారు. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్లం కాదన్నారు. తన చేతిలో పెట్టిన గులాబీని చూపిస్తూ.. తాను ఇక్కడ ఉన్నాను కాబట్టే చేతికి గులాబీ ఇవ్వగలిగారని..దీని అర్థం ఏమిటి? అని ప్రశ్నించారు. అక్కడున్నప్పుడు తమకు ఏదైనా జరిగితే.. తమ కుటుంబాలు ఏం చేస్తాయి? అంటూ సూటిగా ప్రశ్నించారు. ఏమైనా.. సరైన సమయంలో ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంటే.. ఇలా చేతికి పువ్వులు ఇవ్వాల్సిన అవసరం వచ్చేది కాదన్న విద్యార్థి ఆవేశనపు మాటల్లో కాస్తంత అర్థం ఉందనే చెప్పాలి.