Begin typing your search above and press return to search.

అరడుగుల బుల్లెట్ కు అవమానం

By:  Tupaki Desk   |   25 July 2015 12:36 PM GMT
అరడుగుల బుల్లెట్ కు అవమానం
X
రాష్ట్ర విభజన సందర్భంగా.. ఏపీలోని ప్రజలంతా ముద్దుగా.. అరడుగుల బుల్లెట్ గా పిలుచుకొని.. రాజకీయ నాయకులతో పోలిస్తే.. ఏపీ ఎన్జీవో నేతనే ధర్మంగా వ్యవహరిస్తున్నారంటూ అశోక్ బాబు ను భుజానికి ఎత్తుకోవటం తెలిసిందే. ఆయన పిలుపునిస్తే చాలు.. దేనికైనా రెఢీ అన్నట్లుగా విద్యార్థులు.. ఉద్యోగులు.. మహిళలు.. ఇలా ఒకరేంటి ఆంధ్రప్రజానీకం ఆయనకు అండగా నిలిచింది.

విభజన జరిగే కీలక సమయంలో కామ్ అయిపోయిన అశోక్ బాబు.. ఆ తర్వాత విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని పెద్దగా మాట్లాడింది లేదు. అసంతృప్తి వ్యక్తం చేసింది లేదు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకభూమిక పోషించినట్లు కనిపించినా.. కీలక సమయంలో పగ్గాలు వదిలేశారన్న అపప్రదను మూటగట్టుకున్నారు.

తాజాగా ఆయనకు అభినందన సభను కర్నూలు జిల్లాకు చెందిన ఏపీ ఎన్జీవో నేతలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి కర్నూలు చేరుకున్న ఆయనకు ఊహించని అవమానం ఎదురైంది. ఆయనకు ఏర్పాటు చేసిన అభినందన సభను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుకోవటమే కాదు.. విభజనకు అనుకూలంగా వ్యవహరించారంటూ నినాదాలు చేశారు.

విభజనకు అనుకూలంగా ఎలా వ్యవహరించారని ఆయన్ను నిలదీశారు. ఈ అనుకోని పరిణామంతో షాక్ తిన్న ఉద్యోగ సంఘాల నేతలు తేరుకొని.. విద్యార్థులతో వాగ్వాదానికి దిగారు. ఇదే అశోక్ బాబు.. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కర్నూలులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు లక్షలాదిగా విచ్చేసి.. ఆయన చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా నిలవటం తెలిసిందే. అలాంటి ఆయన.. ఈ రోజు విద్యార్థలు తిట్లను భరించాల్సిన దుస్థితి.