Begin typing your search above and press return to search.

అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడలేక అడ్డంగా దొరికిపోయి భారత్ పరువు తీసిన విద్యార్థులు

By:  Tupaki Desk   |   4 Aug 2022 4:22 AM GMT
అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడలేక అడ్డంగా దొరికిపోయి భారత్ పరువు తీసిన విద్యార్థులు
X
అగ్రరాజ్యం అమెరికాలో భారత పరువు పోయిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంగ్లీష్ భాష సామర్థ్యపు పరీక్ష 'ఐఈఎల్టీఎస్'లో అర్హత సాధించిన ఆరుగురు భారతీయ విద్యార్థులు.. అమెరికాలో అక్రమ చొరబాటుకు ప్రయత్నించడంతో దొరికిపోయారు. వారిని కోర్టులో హాజరుపరచగా.. ఇంగ్లీష్ లో సమాధానాలు చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. దీంతో అమెరికా నేరవిభాగం ఆదేశాలతో ఐఈఎల్టీఎస్ పరీక్ష అవకతవకలపై గుజరాత్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

రెండు వారాల కిందట.. అమెరికా-కెనడా సరిహద్దులో ఆక్వేసాసేన్ వద్ద సెయింట్ రెగిస్ నదిలో మునిగిపోతున్న ఓ పడవ నుంచి కొందరినీ అమెరికా సిబ్బంది రక్షించారు. అందులో ఆరుగురు భారతీయ విద్యార్థులు ఉన్నారు.

అయితే ఆ ఆరుగురు జడ్జి అడిగిన ప్రశ్నలకు ఇంగ్లీష్ లో సమాధానాలు ఇవ్వలేక తడబడ్డారు. దీంతో అప్పటికప్పుడు ఓ హిందీ ట్రాన్స్ లేటర్ సాయంతో కోర్టు వాళ్ల నుంచి వాంగ్మూలం సేకరించింది.

కెనడా నుంచి వాళ్లు అక్రమంగా అమెరికాలోకి చొరబడాలని ప్రయత్నించారు. అయితే ఐఈఎల్టీఎస్ లో వీళ్లు 6.5-7 మధ్య స్కోర్ చేశారని తెలియడంతో కోర్టు సైతం ఆశ్చర్యపోయింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ముంబైలోని అమెరికా క్రిమినల్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ దర్యాప్తు చేపట్టాల్సిందిగా గుజరాత్ పోలీసులకు మెయిల్ చేసింది.

IELTS ఇంగ్లీష్ సామర్థ్యాన్ని నిరూపించుకునే పరీక్ష. చాలా దేశాల్లో మంచి కాలేజీల్లో అడ్మిషన్ల కోసం ఈ పరీక్షలో మంచి స్కోర్ అవసరం కూడా . భారతీయ విద్యార్థులు అక్రమ చొరబాటు వార్త వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో భిన్న చర్చ నడుస్తోంది. పరీక్షలో మోసం చేసి న్యూజెర్సీ దాకా వెళ్లి మరీ భారత దేశపరువు తీశారని.. ఇది మరికొందరు విద్యార్థుల ప్రయత్నాలపై ప్రభావం చూపెడుతుందని అంటున్నారు.

గుజరాత్ లోని నవసారీ టౌన్ లో సెప్టెంబర్ 21, 2021లో వీరి పరీక్ష రాశారు. ఈ విద్యార్థులంతా 19-21 ఏళ్ల లోపు వారే. స్టూడెంట్ వీసా మీద మార్చి 19న కెనడాకు వెళ్లారు. అక్కడి యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందారు. ఆపై అక్రమంగా అమెరికాలోకి చొరబడే ప్రయత్నాలు చేస్తే సరిహద్దుల్లో అమెరికా అధికారులకు దొరికిపోయారు. ఈ అక్రమ ఇంగ్లీష్ సర్టిఫికెట్ల రాకెట్ గుట్టు వీడడంతో గుజరాత్ లో మరో మూడు కేంద్రాలపై పోలీసులు దాడులు చేస్తున్నారు.