Begin typing your search above and press return to search.

నేతాజీ రహస్యాలు బయటకు వచ్చేనా?

By:  Tupaki Desk   |   15 April 2015 6:10 AM GMT
నేతాజీ రహస్యాలు బయటకు వచ్చేనా?
X
దేశ స్వాతంత్య్ర పోరాటం గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న వారు ఎవరైనా సరే.. సుభాష్‌ చంద్రబోస్‌ను హీరోగా చూస్తారు. ఆయన్ని అభిమానిస్తారు.. అంతకు మించి ఆరాధిస్తారు. వీలైతే.. మరింతగా బోస్‌ గురించి తెలుసుకోవాలని తపిస్తుంటారు.

బోస్‌ వాస్తవం అయినప్పటికీ కాల్పనిక కథల్లో నాయకుడి తీరులో ఆయన జీవితం ఉంటుంది. ఆయన పోరాటం.. ఆ రోజుల్లోనే దేశ స్వాతంత్య్రం కోసం విదేశాల సాయం కోరటం.. మిత్రదేశాల కూటమిని ఏర్పాటు చేయటం లాంటివెన్నో కనిపిస్తాయి. ఆయన మరణం మీద ఉన్నంత సస్పెన్స్‌ మరే నేత మీద ఉండరు. బోస్‌ని విపరీతంగా అభిమానించే మరికొందరైతే.. ఇంకా ఆయన బతికే ఉన్నారని.. ఏదో ఒకరోజు తిరిగి వచ్చి అందరిని ఆశ్చర్యపరుస్తారని చెప్పేవారున్నారు.

దీనికి తోడు బోస్‌కు సంబంధించి.. ఆయన మరణానికి సంబంధించి భారత ప్రభుత్వం దగ్గరున్న సమాచారాన్ని బయట పెట్టాలని కోరితే.. పలు మిత్రదేశాలతో సంబంధాలు కోల్పోయే అవకాశం ఉన్నందున.. అధికారిక రహస్యాల కింద వెల్లడించటం కుదరదని కేంద్రం పేర్కొనటం కనిపిస్తుంది. అత్యంత రహస్యమైన ఫైళ్ల జాబితాలో బోస్‌కు సంబంధించినవి ఉన్నాయి. గోప్యంగా ఉంచాల్సిన అంశాల్లో బోస్‌ జీవితం ఉండటం ఆసక్తిని రేకెత్తించేవే.

దీనికితోడు తాజాగా సుభాష్‌చంద్రబోస్‌కు సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న విషయాలు చూసినప్పుడు.. ఏదో జరిగిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బోస్‌ కుటుంబం మీద.. భారత తొలి ప్రధాని నెహ్రూ నిఘా నీడలో ఉంచటం లాంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు బోస్‌ మరణంపై అనుమానాలు మరింతగా పెరుగుతాయి. ఆయన్ను రష్యా చంపిందని.. దానికి నెహ్రూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారంటూ చెబుతున్న కథనాలు విన్నప్పుడు మరింత కన్ఫ్యూజన్‌కు గురి కావటం ఖాయం.

బోస్‌ని విపరీతంగా అభిమానించినట్లు చెప్పుకునే బీజేపీ ఏలుబడిలో బోస్‌కు సంబంధించి విషయాలు బయటకు రావటం లేదు. తాజాగా విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీని సుభాష్‌ చంద్రబోస్‌ మనమడు సూర్యకుమార్‌ బోస్‌ కలిశారు. బోస్‌కు సంబంధించిన రహస్య పత్రాల్ని బయటపెట్టాలని ఆయన కోరారు.

దీనికి స్పందనగా మోడీ మాట్లాడుతూ.. బోస్‌కు సంబంధించిన నిజాలు తెలియాల్సిదేనని వెల్లడించినట్లుగా ఆయన చెబుతున్నారు. బోస్‌కు సంబంధించిన నిజాలు బయటపెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. నెహ్రూ కుటుంబం గూఢచర్యం చేసిందన్న ఆరోపణలు విని తాను షాక్‌కు గురైనట్లుగా బోస్‌ మనమడు చెబుతున్నారు. తాజా పరిస్థితుల్లో బోస్‌ రహస్య పత్రాలు బయటకు వస్తాయా? అంటే లేదనే చెప్పాలి.

బోస్‌ మీద ప్రేమను ఒలకబోసే బీజేపీ నేతృత్వంలో గతంలోనూ వాజ్‌పేయ్‌ ప్రభుత్వం నడిచింది. అప్పుడు కూడా ఎలాంటి ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు మోడీ మాట ఇస్తున్నా అది జరుగుతుందన్న నమ్మకం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. నిజంగా.. బోస్‌ రహస్య పత్రాలను విడుదల చేయాలంటే ఇంతకాలం ఉపేక్షించాల్సిన అవసరం లేదు.

రాజకీయంగా ఒకరిని ఒకరు దెబ్బ తీసుకోవటం మామూలే అయినా.. దేశాన్ని కుదిపేసే అంశాల పట్ల వీలైనంత సంయమనం పాటించటం మామూలే. విదేశీ సంబంధాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే అంశాల పట్ల దూకుడుతనం పనికిరాదన్న విషయం మోడీకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆ విషయాలు తెలీవనుకోవటం పొరపాటే అవుతుంది. కొన్ని విషయాల్ని కదిలించుకోవటం కన్నా స్టేటస్‌ కో మొయింటైన్‌ చేయటం ఉత్తమం అన్న విషయం మోడీ అండ్‌ కో కు తెలియంది ఏమీ కాదు. దీనికి మోడీ సర్కారు ఏమీ అతీతం కాదు కూడా.