Begin typing your search above and press return to search.

ఇడా తుఫాన్ బీభత్సం.. నీట మునిగిన న్యూయార్క్, న్యూజెర్సీ!

By:  Tupaki Desk   |   2 Sep 2021 4:16 PM GMT
ఇడా తుఫాన్ బీభత్సం.. నీట మునిగిన న్యూయార్క్, న్యూజెర్సీ!
X
అమెరికాపై ఇడా తుఫాన్ విరుచుకుపడింది. తుఫాన్ బీభత్సానికి వరదలు పోటెత్తాయి. అమెరికా తూర్పు తీరం నీటమునిగింది. ఆకస్మిక వరదలు, టోర్నడోల కారణంగా అమెరికాలో 9 మంది మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇళ్లలోకి చేరిన వరద నీటిలో కొంతమంది చిక్కుకున్నారు. కొట్టుకుపోయిన వాహనంలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. న్యూయార్క్, న్యూజెర్సీ గవర్నర్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

న్యూయార్క్ సెంట్రల్ పార్కులో కేవలం ఒక గంట వ్యవధిలోనే 8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంభవృష్టి వర్షం కురిసింది. దీంతో న్యూయార్క్ సిటీ సబ్ వే లైన్లన్నీ మూసివేశారు. రహదారులపై వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.

న్యూయార్క్, న్యూజెర్సీల్లో అనేక విమాన సర్వీసులను, రైళ్లను నిలిపివేశారు. ఇదొక వాతావరణ విపత్తు అని న్యూయార్క్ నగర మేయర్ ప్రకటించారు. న్యూజెర్సీలో మరో వ్యక్తి మరణించినట్టు తెలిపారు. మొత్తం న్యూయార్క్ లో ఏడుగురు మరణించారని తెలిపారు. కొందరు ఇళ్ల బేస్ మెంట్లలో చిక్కుకొని మృతిచెందినట్లు తెలిపారు. మృతుల్లో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడని తెలిపారు.

వరద నీటిలో చిక్కుకున్న సబ్ వేస్టేషన్లు, ఇళ్లు, నీట మునిగిన రహదారుల ఫొటోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. న్యూయార్క్ నగరం, బ్రూక్లిన్, క్వీన్స్, లాంగ్ ఐలాండ్ లోని కొన్ని ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. మసాచుసెట్స్ రోడ్ ఐలాండ్ లోని కొన్ని ప్రాంతాల్లో టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు.

ఈ వారం ప్రారంభంలో దక్షిణ లూసియానాలో ఇడా తుఫాను విధ్వంసం సృష్టించింది. లూసియానాలో లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. న్యూ ఓర్లీన్స్ లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. ప్రస్తుతం ఇడా తుఫాన్ ప్రభావం దేశానికి తూర్పు నుంచి ఉత్తరం వైపునకు కొనసాగుతోంది.