Begin typing your search above and press return to search.

కేరళ కాంగ్రెస్ ను షేక్ చేస్తున్న సరితా

By:  Tupaki Desk   |   12 May 2016 4:45 AM GMT
కేరళ కాంగ్రెస్ ను షేక్ చేస్తున్న సరితా
X
అసలే ఎన్నికల కాలం. ఇలాంటి సమయంలో బయటకు వచ్చే ప్రతి అంశం ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపిస్తుంది. విడిగా ఎలా ఉన్నా.. ఎన్నికల వేళలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంటారు. కానీ.. కేరళలోని కాంగ్రెస్ సర్కారు ఎంత జాగ్రత్త పడుతున్నా దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తాజాగా సోలార్ స్కాంలో నిందితురాలు సరితా నాయర్ చేస్తున్న ఆరోపణలు పెను సంచలనంగా మారాయి. కేరళలోని కాంగ్రెస్ ప్రభుత్వం తనను పావులా వాడుకున్నారంటూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త కలకలాన్ని రేపుతున్నాయి. ఇప్పటివరకూ సోలార్ స్కాం గురించి మాట్లాడిన సరితా.. తాజాగా ఒక భూమి డీల్ లో కూడా తాను మధ్యవర్తిగా వ్యవహరించినట్లుగా పేర్కొన్నారు.

కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ.. ఆయన కుమారుడు.. మరికొందరు మంత్రులపై ఆమె చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు ఐదు రోజుల ముందు సరిత ఆరోపణలు చేయటమే కాదు.. వాటికి సంబంధించిన కొన్ని ఆధారాల్ని కూడా విడుదల చేయటంతో వాతావరణం వేడెక్కింది. తాను చేస్తున్న ఆరోపణలకు సంబంధించి రెండు పెన్ డ్రైవ్ లు.. కొన్ని పత్రాల్ని ఎన్నికల కమిషన్ కు ఇచ్చినట్లుగా ఆమె చెబుతున్నారు.

అంతేకాదు.. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాల్ని శుక్రవారం తాను విడుదల చేయనున్నట్లుగా చెబుతున్నారు. సరిత నాయర్ పుణ్యమా అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉమెన్ చాందీ సర్కారు కొత్త ఆరోపణలతో మరెన్ని కష్టాలు ఎదురవుతాయో..?