Begin typing your search above and press return to search.

ఓవైసీ, స్వామి ఒకే మాట చెప్పారు

By:  Tupaki Desk   |   27 Nov 2016 5:28 AM GMT
ఓవైసీ, స్వామి ఒకే మాట చెప్పారు
X
అసదుద్దీన్ ఒవైసీ - అఖిలభారత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత. క‌ర‌డుగ‌ట్టిన ముస్లిం వాది. సుబ్రహ్మణ్యస్వామి హిందుత్వ గ‌ళాన్ని బ‌లంగా వినిపించే బీజేపీ ఎంపీ. ఈ ఇద్ద‌రు ఒకే వేదిక‌గా, ఒకే పాయింట్ పై ఏకీభ‌వించారు. అంతే కాదు విమ‌ర్శ‌ల విష‌యంలోనూ ఒకే మాట వినిపించ‌డం ఆస‌క్తిక‌రం. ప్ర‌ముఖ టీవీ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ నిర్వహించిన టైమ్స్ లిట్‌ ఫెస్ట్ కార్యక్రమంలో ఇద్దరు నేతలూ ఒకే వేదికపై కలిశారు. అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ వివాదాస్పద స్థలం కేసులో సుప్రీం కోర్టు తీర్పును తాము ఆమోదిస్తామని ఈ ఇద్దరూ స్పష్టం చేశారు. మందిరాన్ని నిర్మించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్తే దానికి తాము అంగీకరిస్తామని ఒవైసీ అన్నారు. ఈ అంశంపై సుబ్రహ్మణ్యస్వామి సైతం త‌నకు కోర్టు తీర్పు స‌మ్మ‌త‌మ‌ని అంగీకరించారు. అదే స‌మ‌యంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పై ఇరువురు నేతలూ ఒకేరకమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒవైసీ నేరుగా జైట్లీని విమర్శించగా, స్వామి మాత్రం పరోక్షంగా ఆరోపణలు చేశారు.

ఈ చ‌ర్చ‌లో స్వామి మాట్లాడుతూ ‘‘నేను హింసను సమర్థించను. చట్టం చేసే నిర్ణయాన్ని సమర్థిస్తా. అత్యున్నత న్యాయస్థానం ఏ విధమైన తీర్పు చెప్పినా దాన్ని ఆమోదిస్తా’’ అని అన్నారు. తనను మతతత్వవాదిగా పేర్కొనడాన్ని స్వామి ఖండించారు. ‘‘నా భార్య పార్సీ - నా అల్లుడు ముస్లిం - బావమరిది యూదు - కోడలు క్రిస్టియన్. వీళ్లెవరూ నన్ను మతతత్వ వాది అనలేదు. కానీ కొంద‌రు మాత్రం న‌న్ను మ‌త‌తత్వా వాది అంటారు. ఈ దేశం హిందూ మెజారిటీ దేశం. చట్టంపై విశ్వాసం ఉన్న దేశం. రాముడు ఇక్కడే పుట్టాడని నమ్మే దేశం. మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని గౌరవించటం - ఆమోదించటం అవసరం’’ అని స్వామి వ్యాఖ్యానించారు. స్వామి మాటల్ని ఒవైసీ ఖండించారు. ‘‘ఈ మెజారిటీ సిద్ధాంతమే మైనారిటీల పాలిట శాపంగా మారింది. నెహ్రూ సైతం ఈ సిద్ధాంతం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడే గోవధ - ఉమ్మడి ఏకీకృత చట్టం - అయోధ్య వంటి అంశాలను బీజేపీ తన అజెండాలోకి తీసుకువస్తుంది’’ అని ఒవైసీ అన్నారు. హిందుత్వ అనేది కేవలం ఓటు బ్యాంకు కోసమే అని అరుణ్‌జైట్లీ ఒకప్పుడు వ్యాఖ్యానించినట్లు వికీలీక్స్ డాక్యుమెంట్ బయటపెట్టిందని ఒవైసీ అనగా, అవునని సుబ్రహ్మణ్యస్వామి సమర్థించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు చెప్పినా శిరసావహిస్తామని ఇద్ద‌రు నేత‌లు అంగీకరించ‌డంపై రాజ్ దీప్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/