Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరు కాంట్రవర్సీకి కేపిటల్

By:  Tupaki Desk   |   11 Jan 2016 7:11 AM GMT
ఆ ఇద్దరు కాంట్రవర్సీకి కేపిటల్
X
సుబ్రహ్మణ్య స్వామి... వివాదాలంటే తెగ‌మ‌క్కువ చూపే బీజేపీ నేత. ఆస‌క్తిక‌ర‌మైన అంశంపై కొత్త‌ ట్విస్ట్‌ తో వార్తల్లో నిలిచే సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి తాజాగా మ‌రో బాంబు పేల్చారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ మద్దతు ఇచ్చారని ఆయన తెలియజేశారు! రామ మందిరం నిర్మాణంపై ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన సదస్సులో ప్రసంగించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 'అయోధ్యలో రామ మందిరం నిర్మితమై తీరుతుంది. ఏ చిన్న అవకాశం చిక్కినా నేనూ మద్దతిస్తా. ఈ విషయంలో పార్టీల ప్రమేయాన్ని పట్టించుకోను' అని రాజీవ్ గాంధీ స్వయంగా తనకు చెప్పారని సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ చేతుల మీదుగా ప్రారంభమైన రామాయణ్ టీవీ సీరియల్ దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించిందని కూడా స్వామి పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ రామ మందిరానికి మద్దతు పలకాల్సిందేనని స్వామి డిమాండ్ చేశారు.

మ‌రోవైపు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సంచలన ప్రకటన చేశారు. మహ్మద్ ప్రవక్త జన్మ స్థలం అయోధ్య కాదని ఆయన తేల్చిచెప్పారు. హిందువుల ఆరాధ్య దైవం రాముడు అయోధ్యలోనే జన్మించారని చెప్పిన రాందేవ్ ముస్లింలు తమ దేవుడిగా భావిస్తున్న మహ్మద్ ప్రవక్త మాత్రం అయోధ్యలో జన్మించలేదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాత్రి ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌ లో సంచలన కామెంట్లను పోస్ట్ చేశారు. 'రాముడు మనకు ఆరాధ్యుడు. అయోధ్య రాముడి జన్మ స్థలమన్న విషయాన్ని ప్రతి హిందువు, ముస్లిం గుర్తించాలి. అదే సమయంలో అయోధ్యలో మహ్మద్ ప్రవక్త జన్మించలేదన్న వాస్తవాన్ని గుర్తెరగాలి' అని రాందేవ్ ట్వీటారు.

ఇద్ద‌రు హిందుత్వ‌వాదులు చేస్తున్న కామెంట్లు ఇపుడు ప్ర‌తిపక్షాల‌కు మంచి అవ‌కాశంగా మారాయి. స్వామి వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్‌, రాందేవ్ వ్యాఖ్య‌ల‌పై ముస్లిం నేత‌లు త‌మ‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేశారు.