Begin typing your search above and press return to search.
మెహబూబా నిర్ణయం అర్థరహితం...స్వామి!
By: Tupaki Desk | 30 Jan 2018 7:14 PM GMTబీజేపీ రాజ్యసభ సభ్యుడు - ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్య స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం ఆయన ప్రత్యేకత. స్వపక్షం - ప్రతిపక్షం - తన - మన తారతమ్యాలు లేకుండా.....నిర్మొహమాటంగా వ్యాఖ్యానించడం ఆయనకు పరిపాటి. తాజాగా, ఈ ఫైర్ బ్రాండ్ జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మెహబూబాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యంపై కేసు పెట్టడంపై అర్ధం పర్ధం లేని నిర్ణయమని సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. ఇటువంటి పనులు చేయడం మానుకోవాలని మెహబూబాకు సూచించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
సైన్యంపై మెహబూబా ఆంక్షలు విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ విషయంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. లేదంటే...విచక్షణ అధికారాలను ఉపయోగించి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెహబూబా నిర్ణయాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో స్వామి వ్యాఖ్యలు కలకలం రేపాయి. మెహబూబా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేబినెట్ నుంచి వచ్చేందుకు బీజేపీ నేతలు సిద్ధ పడడం సంచలనం రేపింది. అయితే, హైకమాండ్ సూచనలతో వారు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కశ్మీర్ షోపియాన్ జిల్లాలోని గోవాంపురాలో శనివారం సైనిక వాహన శ్రేణిపై దాదాపు 250 మందికి పైగా నిరసనకారులు రాళ్లు రువ్వారు. సైన్యం నుండి ఆయుధాలు లాక్కొనేందుకు ప్రయత్నించడంతో సైన్యం కాల్పులకు దిగింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాల్సిందిగా రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్..... సైన్యాన్ని ఆదేశించారు. అయితే, కాల్పుల జరిపిన సైన్యంపై జమ్మూ కశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది.