Begin typing your search above and press return to search.

సుబ్రహ్మణ్య స్వామికి కౌంట్ డౌన్ మొదలైందా?

By:  Tupaki Desk   |   22 Jun 2016 12:11 PM GMT
సుబ్రహ్మణ్య స్వామికి కౌంట్ డౌన్ మొదలైందా?
X
బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి ఆ పార్టీ హానీమూన్ పీరియడ్ ముగుస్తున్నట్లుగా కనిపిస్తోంది. బీజేపీ - సుబ్రహ్మణ్య స్వామిల ఉమ్మడి టార్గెట్లను ఆయన అటాక్ చేసినంత కాలం బీజేపీ ఏమీ అననప్పటికీ తమకు అనుకూలమైన వ్యక్తులనూ ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి టార్గెట్ చేస్తుండడంతో సీను మారుతోంది. ఆర్ బీఐ గవర్నర్ రఘురాం రాజన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు - బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామిని ఏమీ అనని ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రధాని ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ను తొలగించాలని డిమాండ్ చేసిన వేళ స్వామిపై మండిపడుతున్నారు. ఆర్బీఐ తదుపరి గవర్నరుగా రేసులో ఉన్న అరవింద్ పై సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు చేస్తున్న స్వామిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

స్వామి వార్తల్లో నిలిచేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, పాలనా సంబంధ వ్యవహారాల్లో ఈ తరహా వ్యాఖ్యలు తగవని, అదికూడా సొంత పార్టీపైనే చేస్తుంటే, ప్రజల్లో చులకన అవుతామని బీజేపీ నేతలు అంటున్నారు. కాగా, ఈ ఉదయం స్వామి - అరవింద్ సుబ్రమణియన్ కాంగ్రెస్ వ్యక్తని - ఆయన్ను తక్షణం పదవి నుంచి తొలగించాలని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యలు పోస్టు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ సుబ్రహ్మణ్య స్వామి అసలు లక్ష్యం రాజన్ లేదా అరవింద్ కాదని, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని పదవి నుంచి దింపడమేనని విమర్శలు కురిపించారు.

సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యల కారణంగా ప్రతిపక్షాలకు అవకాశం చిక్కుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానానికి ఇప్పటికే కొందరు ఆయనపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్వామి బీజేపీలో చేరిన తరువాత సోనియా - రాహుల్ గాంధీలను నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టుకు ఈడ్చడం వంటి కారణాల వల్ల పార్టీలో ఆయనకు మంచి స్థానమే దక్కింది. ఆ తరువాత రఘురామ్ రాజన్ విషయంలోనూ పార్టీ పెద్దల నుంచి తెర వెనుక మద్దతు లభించిందని చెబుతారు. కానీ.. ప్రస్తుతం అరవింద్ సుబ్రమణియన్ విషయానికొస్తే... ఆయన్ను రఘురాం రాజన్ స్థానంలో నియమించాలని ప్రధాని అనుకుంటున్నారు. అలాంటి వ్యక్తిపై స్వామి ఆరోపణలు చేసేసరికి బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సుబ్రహ్మణ్య స్వామికి ఇంతకాలం బీజేపీలో బాగా చూసుకున్నారని.. ఇక ఆ పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు.