Begin typing your search above and press return to search.

బీజేపీలో స్వామి మార్కు బాంబు పేలింది!

By:  Tupaki Desk   |   20 Dec 2016 4:15 AM GMT
బీజేపీలో స్వామి మార్కు బాంబు పేలింది!
X
బీజేపీకి ట్రబుల్ షూటర్ అనే పేరు సంపాదించుకున్న అతితక్కువ పేర్లలో సుబ్రహ్మణ్యస్వామి ఒకరు. అయితే గత కొన్ని రోజులుగా నోట్ల రద్దు వ్యవహారంపై పెద్దగా స్పందించినట్లు కనిపించని సుబ్రహ్మణ్య స్వామి తాజాగా ఒక బాంబు పేల్చారు. ఎవరో ప్రతిపక్షాలు - మోడీ అంటే గిట్టనివారు - బీజేపీ వ్యతిరేకులు వ్యాఖ్యానించినట్లుగా స్పందించినప్పటికీ... ఈయనకూడా చెబుతున్నారు కాబట్టి ఎంతో కొంత వాస్తవం ఉండి ఉంటుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యల్లో 1శాతం నిజం ఉన్నా కూడా ఇప్పటివరకూ ప్రజలు పడిన కష్టాలకు - దేశంకోసం అని భావించి అనుభవించిన కష్టాలకు విలువ లేనట్లే చెప్పుకోవాలి. ఇంతకూ ఈ భారతీయ జనతా పార్టీ అగ్రనేత - రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలు ఏమిటంటారా...? పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ముందుగానే లీకైందట.

అవును... కోయంబత్తూరులో మీడియాతో మాట్లాడిన సుబ్రహ్మణ్య స్వామి... బీజేపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిందని, నోట్లు రద్దు చేయాలనే ఆలోచనే ఉంటే ముందస్తు ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించేందుకు ముందుగా బహిరంగ ప్రదేశాల్లో ఏటీఎంలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని, పన్నులు తగ్గించాలని సైతం తాను సూచించినట్లు తెలిపిన స్వామి... ఆర్ధిక మంత్రిపైనా విమర్శలు చేశారు. తాను చేసిన సూచనలను పట్టించుకోని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ - ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న కరెన్సీ కష్టాలకు బాధ్యత వహించాలని అన్నారు. ఇదే సందర్భంగా మరోసారి చెబుతూ... పెద్ద నోట్లు చెల్లవని కేంద్రం ప్రకటించక ముందే ఈ నిర్ణయం లీకైందని ఆయన గట్టిగా వ్యాఖ్యానించారు. అయితే ఇంతవరకూ బాగానే ఉంది కానీ... ఈ వ్యవహారంపై తాను కేసులేవీ దాఖలు చేయడం లేదని చెప్పడం పైగా కేంద్రమే కేసు వేయాలనికోరడం మాత్రం ఆయన అభిమానులకు కాస్త ఇబ్బందిగా ఉందట. ఏది ఏమైనా... అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడే కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని దుయ్యబట్టడం, ఆర్ధిక మంత్రిపై నిప్పులు చెరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/