Begin typing your search above and press return to search.

చిన్నమ్మ జాతకం ముచ్చట చెప్పిన స్వామి

By:  Tupaki Desk   |   8 Feb 2017 4:45 AM GMT
చిన్నమ్మ జాతకం ముచ్చట చెప్పిన స్వామి
X
వివాదాస్పద వ్యాఖ్యలే కాదు.. అప్పుడప్పుడు ఆసక్తికర మాటల్ని చెబుతుంటారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సుబ్రమణ్య స్వామి. తమిళనాడుకు చెందిన ఆయన.. తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే.. ఆయన ప్రత్యేకత ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. తమిళనాడు సీఎంగా బాధ్యతలు స్వీకరించటాన్ని ఏ మాత్రం ఇష్టపడని అధినాయకత్వం తీరును ఆయన తెలివిగా ఇబ్బంది పెట్టిన వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సీఎం కావటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న చిన్నమ్మకు ఝులక్ ఇచ్చిన కేంద్రాన్ని స్వామి తనదైన శైలిలో క్వశ్చన్ చేశారు. అంతేకాదు.. తమిళనాడు ముఖ్యమంత్రిగా చిన్నమ్మకున్న అర్హతల్ని ఆయన వివరించటం విశేషం. ఊరంతా ఒక దారి అయితే.. ఉలిపికట్టెది మరో దారి అన్న చందంగా ఆయన.. శశికళ వ్యక్తిగతంగా నచ్చినా.. నచ్చకున్నా.. ప్రజాస్వామ్యబద్ధంగా.. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని.. ఆమెను సీఎంగా ప్రమాణస్వీకారం చేయించకుండా ఎందుకు జాప్యం చేశారో గవర్నర్ ను ప్రశ్నించాలంటూ కేంద్రాన్ని కోరారు.

ముఖ్యమంత్రిగా చిన్నమ్మ ప్రమాణస్వీకారం జరగకుండా ఆగిందన్న విషయం బహిరంగ రహస్యమే అయినప్పటికీ.. అలాంటిదేమీ తనకు తెలీదన్నట్లుగా అమాయకంగా తన వాదనను వినిపించిన స్వామి.. మరోఆసక్తికరమైన మాటను చెప్పుకొచ్చారు. శశికళ ఎప్పుడుప్రమాణస్వీకారం చేస్తారో కూడా వెల్లడించటం గమనార్హం.

చిన్నమ్మ జాతకం ప్రకారం గురువారం చాలా అనువుగా ఉందని.. ఆమెకు సరిగ్గా సరిపోయే ముహుర్తంగా స్వామి చెప్పారు. సీఎంగా కుర్చీలో కూర్చోవటానికి సిద్ధమైన వ్యక్తిగా శశికళను గుర్తించాలన్న ఆయన.. ఆమెను ప్రమాణస్వీకారం చేయించకుండా ఆగిన గవర్నర్.. ఎందుకలా? అన్నది సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పటమే కాదు.. ఆమె భక్తిశ్రద్ధలున్న హిందూ మహిళగా అభివర్ణించటం గమనార్హం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చిన్నమ్మను ఇంతగా వెనకేసుకొచ్చినట్లుగా మాట్లాడిన స్వామి.. చిన్నమ్మ వేర్వేరుగా మాతా అమృతానందమయిని ఒకేరోజు కలవటం కాసింత ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/