Begin typing your search above and press return to search.

అరే.. స్వామిని కూడా మార్చేశారుగా

By:  Tupaki Desk   |   3 Jun 2018 4:28 AM GMT
అరే.. స్వామిని కూడా మార్చేశారుగా
X
కొంత‌మంది రాజ‌కీయ నాయ‌కుల రూటు స‌ప‌రేటుగా ఉంటుంది. వాళ్ల‌కు తామున్న పార్టీ ఏద‌న్న‌ది ముఖ్యం కాదు.. తాము ఏం అనుకున్నామో అదే ముఖ్య‌మ‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ఇష్యూ బేస్డేగా వారి స్పంద‌న ఉంటుంది. సొంత పార్టీ మీద సైతం విమ‌ర్శ‌లు చేసే ద‌మ్ము.. ధైర్యం ఉంద‌న్న‌ట్లుగా మాట‌లు వినిపిస్తూ ఉంటాయి. ఈ త‌ర‌హా ఇమేజ్ ఉన్న నేత‌ల లిస్ట్ చూస్తే.. వారిలో బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌మ‌ణ్య స్వామి క‌నిపిస్తారు.

త‌న నోటితో త‌ర‌చూ సంచ‌ల‌నాల‌కు కేంద్రంగా ఉండే పెద్ద‌మ‌నిషి.. ఈ మ‌ధ్య కాలంలో కాస్తంత కామ్ గా ఉంటుంది. గ‌తంలో మాదిరి ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా నోటికి ప‌ని చెప్ప‌టం లేదని చెప్పాలి. అలాంటి ఆయ‌న‌.. ఆ లోటును తీరుస్తూ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు చూస్తే.. స్వామి కూడా పూర్తిగా మారిపోయిన‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.

అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత అన్నాడీఎంకే పార్టీని పూర్తిగా స్వాధీనం చేసుకొని.. తాము చెప్పిన‌ట్లుగా ప‌ని చేయించుకుంటున్నార‌న్న ఆరోప‌ణ బీజేపీ మీద ఉంది. అన్నాడీఎంకే ప‌గ్గాల్ని అమ్మ త‌ర్వాత చిన్న‌మ్మ చేప‌ట్ట‌టం.. నాట‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె జైలుకు వెళ్ల‌టం.. సీఎంగా ప‌ళ‌ని స్వామి ఎంపిక కావ‌టం ఇవ‌న్నీ కూడా బీజేపీ పెద్ద‌లు రాసిన స్క్రీన్ ప్లేకు త‌గ్గ‌ట్లే చోటు చేసుకున్నాయ‌న్న ఆరోప‌ణ ఉంది. మోడీషాల చాణుక్యంగా త‌మిళ‌నాడును త‌మ క‌నుస‌న్నల్లోకి తెచ్చుకోవ‌టంలో క‌మ‌ల‌నాథులు స‌ఫ‌ల‌మ‌య్యార‌న్న మాట వినిపించింది.

ఈ మాట నిజ‌మ‌న్న ఆధారం ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. తాజాగా సుబ్ర‌మ‌ణ్య స్వామి మాట‌లు వింటే.. అవున‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చెప్పేస్తాడ‌న్న ఇమేజ్ ఉన్న పెద్ద‌మ‌నిషి.. అందుకు భిన్నంగా త‌న‌దైన ఎజెండాను పెట్టుకొని మాట్లాడిన తీరు చూస్తే.. స్వామిలోనూ రాజ‌కీయం బాగా వంట ప‌ట్టేసింద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. ఇంత‌కూ స్వామి చేసిన వ్యాఖ్య‌ల్ని చూస్తే.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే సినీ న‌టులు మాట‌పై నిల‌బ‌డ‌టం లేద‌న్నారు.

ఈ విష‌యాన్ని యావ‌న్మంది త‌మిళ ప్ర‌జ‌లు గుర్తించాల్సిందిగా కోరారు. ఓకే.. ఈ మాట‌ల్లో త‌ప్పేముంద‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే.. అస‌లు పాయింట్ ఈ మాట‌ల త‌ర్వాతే చెప్పారు మ‌రి. త‌మిళ‌నాడులో డీఎంకే కంటే ఎడ‌ప్పాడి స‌ర్కారు బ్ర‌హ్మాండంగా పాలిస్తోంద‌ని చెప్పాడు.

ఇక్క‌డితో ఆపినా స్వామి మీద ఉన్న మ‌ర్యాద‌.. గౌర‌వం నిల‌బ‌డేవి. స్థానిక ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌టానికి గ‌వ‌ర్న‌ర్లు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్ల‌టం మంచిదే అంటూ సిత్ర‌మైన ప్ర‌తిపాద‌నను చేశారు. తాము సుదీర్ఘ‌కాలం పాటు ప్రాతినిధ్యం వ‌హించిన పార్టీల‌కు(లేదంటే.. త‌మ‌ను నియ‌మించిన పార్టీల‌కు) అతీతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన గ‌వ‌ర్న‌ర్లు అందుకు భిన్నంగా వారికి దాసులైన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్న వేళ‌..స్వామి ఈ త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేస్తే.. ఆయ‌న‌లో బీజేపీ మూలాలు భాగానే వంట ప‌ట్టేశాయ‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం. అంతేనా.. తూత్తుకూడి ఘ‌ట‌న త‌ర్వాత కూడా ఏడ‌ప్పాడి ప్ర‌భుత్వం బ్ర‌హ్మాండంగా ప‌ని చేస్తుంద‌న్న మాట‌ను స్వామి లాంటోడు మాత్ర‌మే చెప్ప‌గ‌లుగుతారేమో?