Begin typing your search above and press return to search.

'స్వామి' వారి భ‌గవ‌ద్గీత విన్నారా?

By:  Tupaki Desk   |   28 Jun 2016 12:32 PM GMT
స్వామి వారి భ‌గవ‌ద్గీత విన్నారా?
X
సుబ్ర‌మ‌ణ్య‌స్వామి. ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ.. ఎప్పుడూ ఏవో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే బీజేపీ ఎంపీ. ఈసారి కాస్త స్టైల్ మార్చారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కూడా త‌న తీరును త‌ప్పుబ‌ట్ట‌డంతో ఇక చేసేది లేక విమ‌ర్శ‌లు మాని వేదాంతం మాట్లాడటం మొద‌లుపెట్టారు. ఇందుకు ఆయ‌న ఎంచుకున్నది భ‌గ‌వ‌ద్గీత‌నే. మోడీ క్లాస్ తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన మ‌రుస‌టి రోజే స్వామి వేదాంతం వ‌ల‌క‌బోశారు.

ఇప్ప‌టివ‌ర‌కు త‌న వ్యాఖ్య‌ల‌పై ఎవ‌రు స్పందించినా వాళ్ల‌పై తిరిగి దాడి మొద‌లుపెట్ట‌డం స్వామికి అల‌వాటు. కానీ ఈసారి ప్ర‌ధానే ప‌రోక్షంగా త‌నను త‌ప్పుబ‌ట్ట‌డంతో ఆయ‌న‌ను ఏమీ అన‌లేక స్వామి ఇలా త‌న‌దైన స్టైల్లో ట్వీట్ చేశారు. గీత‌లో కృష్ణుడు చెప్పిన‌ట్లుగా సుఖ‌దుఃఖాల‌కు తాను ఒకేలా స్పందిస్తాన‌ని ఆయ‌న ట్వీట్ చేశారు. సుఖ దుఃఖ స‌మే కృత్వ‌.. అనే శ్లోకాన్ని ఆయ‌న గుర్తు చేశారు. గెలుపోట‌ములు ఏవి ఎదురైనా - సంతోష‌మైనా.. బాధ క‌లిగినా యుద్ధం మాత్రం కొన‌సాగించాల‌ని కృష్ణుడు ఆ శ్లోకంలో వివ‌రిస్తాడు. తాను కూడా దాన్నే ఫాలో అవుతున్న‌ట్లు స్వామి చెప్ప‌క‌నే చెప్పారు. ఇప్ప‌టికైతే ఆయ‌న కాస్త వెన‌క్కి త‌గ్గినా.. తొందర్లోనే మ‌ళ్లీ ఎవ‌రిపైనో దాడికి దిగ‌డం ఖాయ‌మ‌ని స్వామి గురించి బాగా తెలిసిన వాళ్లు చెబుతున్నారు.