Begin typing your search above and press return to search.

మీడియాను ఇలా కూడా వాడేశారా?

By:  Tupaki Desk   |   30 April 2016 7:12 AM GMT
మీడియాను ఇలా కూడా వాడేశారా?
X
ఎన్నికల సమయంలో తమకు అనుకూలమైన వార్తలు రాయించుకునేందుకు వీలుగా పెయిడ్ న్యూస్ ప్రచురించుకునేలా వివిధ రాజకీయ పార్టీలు వ్యవహరించటం తెలిసిందే. ఈ విధానం తీవ్ర దుమారం రేపటమే కాదు.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తేలా చేశాయి. దీనిపై ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేయటం.. తర్వాతి కాలంలో పెయిడ్ న్యూస్ మీద నియంత్రణ విధించటంతో ఈ వ్యవహారం అక్కడితో ముగిసింది.

పెయిడ్ న్యూస్ వ్యవహారం పుణ్యమా అని మీడియా మీద చాలామంది విమర్శలు చేసే అవకాశం దొరికింది. నిత్యం నీతులు వల్లించే మీడియా సంస్థలు.. తమ ఆదాయాన్ని పెంచుకోవటం కోసం ఎలాంటి మొహమాటాలకు పోకుండా పెయిడ్ న్యూస్ ను ప్రచురించేందుకు చూపించిన ఆసక్తిని చూసి పలువురు ముక్కున వేలేసుకునే పరిస్థితి. ఆదాయాన్ని సమకూర్చుకోవటం కోసం మీడియా ఇంతలా దిగజారిపోతుందా? అంటూ ఆవేదన చెందిన వారి సంఖ్య కూడా తక్కువేం కాదు. ఇదిలా ఉంటే.. పెయిడ్ న్యూస్ తరహాలోనే మీడియాలోని కొన్ని సంస్థలు (చాలానే సంస్థలన్నది మరికొందరి ఆరోపణ) వ్యూహాత్మక వార్తల వంటకాల్ని తయారు చేసి జనాల మీదకు వదిలిందన్న ఆరోపణ కూడా ఉంది.

ఈ తరహా వాదనకు బలాన్ని చేకూర్చేలా తాజాగా రాజ్యసభ సభ్యుడు.. బీజేపీనేత సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని టార్గెట్ చేస్తున్న అగస్టా వెస్ట్ లాండ్ ఒప్పందానికి సంబంధించి దేశీయ మీడియాను మేనేజ్ చేసేందుకు మధ్యవర్తులకు భారీగా ముడుపులు చెల్లించినట్లుగా ఆరోపణలు ఉన్నట్లుగా వెల్లడించారు. అగస్టా వెస్ట్ లాండ్ ఒప్పందానికి సంబంధించి సానుకూల వార్తలు మీడియాలో వచ్చేలా చూడటమే ఈ మధ్యవర్తుల పని. ఇలాంటి ప్రయత్నం జరిగిందంటున్న స్వామి.. అలాంటి దుర్మార్గానికి ఎవరు పాల్పడ్డారన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించటం లేదు. తాజాగా స్వామి ఆరోపణలు చూస్తే అర్థమయ్యేది ఒక్కటే.. దేశాల మధ్య జరిగే పలు ఒప్పందాలకు తగ్గట్లు దేశప్రజల మైండ్ సెట్ ను ప్రభావితం చేయటానికి మీడియాను ఓ రేంజ్ లో వాడేస్తున్న విషయం అర్థమవుతుంది.