Begin typing your search above and press return to search.

లిక్క‌ర్ ఫ్యాక్ట‌రీల‌కు పేదోళ్ల బియ్యం

By:  Tupaki Desk   |   26 Oct 2015 8:08 AM GMT
లిక్క‌ర్ ఫ్యాక్ట‌రీల‌కు పేదోళ్ల బియ్యం
X
ఇవాల్టి రోజున రూపాయికి స‌రైన చాక్లెట్ రాని ప‌రిస్థితి. చేతిలో కాస్త ప‌ట్టుకునేంత ప‌ప్పు ఉండ ఖ‌రీదు కూడా రెండు రూపాయిలు. కానీ.. కేజీ బియ్యం ధ‌ర మాత్రం కేవ‌లం రూపాయి మాత్ర‌మే. పేద‌వారి కోసం వంద‌లాది కోట్ల రూపాయిల స‌బ్సిడీ భారాన్ని ప్ర‌భుత్వం మోస్తు అందిస్తున్న ఈ బియ్యం ల‌బ్థిదారుల వ‌ద్ద‌కు వెళుతుందా? వారు ఈ బియ్యాన్ని వినియోగిస్తున్నారా? లాంటి ప్ర‌శ్న‌ల‌కు సంబంధించి తాజాగా చోటు చేసుకున్న ఒక ఉదంతం స‌మాధానాలు చెప్పేస్తుంది.

పేద‌ల‌కు రూపాయికే కిలో బియ్యాన్ని ప్ర‌భుత్వం అందిస్తున్న‌ప్ప‌టికీ వాటిని వినియోగించే వారి సంఖ్య చాలా త‌క్కువ‌ని చెబుతున్నారు. వీలైనంత ఎక్కువ‌గా ఈ బియ్యాన్ని కోళ్ల ఫారాల‌కు.. లిక్క‌ర్‌ ఫ్యాక్ట‌రీల‌కు త‌ర‌లిస్తున్న షాకింగ్ విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్ప‌టివ‌ర‌కూ కోళ్ల ఫారాల‌కు మాత్ర‌మే స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌న్న దాని స్థానే.. కొత్త‌గా లిక్క‌ర్ ఫ్యాక్ట‌రీల‌కు సైతం పేదోళ్ల బియ్యం త‌ర‌లి వెళుతుంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని రెండు లారీల బియ్యాన్ని ప‌ట్టుకున్న సంద‌ర్భంగా పేద‌ల‌కు చేరాల్సిన బియ్యం ఏ విధంగా లిక్క‌ర్ ఫ్యాక్ట‌రీల‌కు త‌ర‌లి వెళ్లే వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చి షాక్ ఇచ్చింది. రేష‌న్ డీల‌ర్లు.. పౌర‌స‌ర‌ఫ‌రా అధికారులు ఇందులో పాత్ర‌ధారులుగా చెబుతున్నారు. పేద‌ల‌కు ప్ర‌భుత్వం అందిస్తున్న బియ్యం నాణ్య‌త లేని నేప‌థ్యంలో.. చౌక‌డిపోల ద్వారా త‌మ‌కిచ్చే బియ్యాన్ని లబ్దిదారులు అమ్ముకోవ‌టం క‌నిపిస్తోంది. దీనికి మ‌ధ్య‌వ‌ర్తులుగా కొంద‌రు చౌక‌డిపో య‌జ‌మానులే ప‌ని చేస్తూ.. బియ్యాన్ని వినియోగించ‌ని వారి నుంచి.. బియ్యం తీసుకోని వారికి సంబంధించి బియ్యాన్ని సేక‌రించ‌టం అక్ర‌మ ప‌ద్ధ‌తిలో ఒక‌చోట స‌మీక‌రించ‌టం.. వీటిల్లో నాణ్య‌త ఉన్న బియ్యాన్ని లిక్క‌ర్‌ఫ్యాక్ట‌రీల‌కు.. నాణ్య‌త అంత‌గా లేని వాటిని కోళ్ల దాణా కోసం.. మ‌రి ఇత‌ర అవ‌స‌రాల కోసం పంపిణీ చేస్తున్నారు. ఓప‌క్క ప్ర‌భుత్వం వంద‌ల కోట్ల మొత్తాన్ని బియ్యం ప‌థ‌కం కోసం ఖ‌ర్చు చేస్తుంటే.. మ‌రోవైపు ఇదేదీ ప్ర‌యోజ‌న‌క‌రంగా కాకుండా అక్ర‌మ‌ప‌ద్ధ‌తిలో త‌ర‌లి వెళ్ల‌టం ఆందోళ‌న క‌లిగించే అంశం. ఈ బియ్యం య‌వ్వారంపై రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.