Begin typing your search above and press return to search.

కమలం పార్టీ గోదారి ఆశలు...గొంతెమ్మ కోర్కెలు

By:  Tupaki Desk   |   24 Dec 2022 5:30 AM GMT
కమలం పార్టీ గోదారి ఆశలు...గొంతెమ్మ కోర్కెలు
X
కాషాయం పార్టీని ఆ మధ్య దాకా ఉత్తరాది పార్టీ అనేవారు. అంటే హిందీ బెల్ట్ లోనే బీజేపీకి ఆదరణ అన్నది ఎకసెక్కంగా అనే మాట. ఇక బీజేపీకి కొన్ని సామాజికవర్గాలకు కలిపి కూడా వారికి చెందిన పార్టీ అని ప్రత్యర్ధులు ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే బీజేపీ అన్ని వర్గాల పార్టీగా ఈ రోజుకూ కాలేకపోయినా నాటి నుంచి నేడు మరికొన్ని వర్గాలను కలుపుకుని ఎదిగింది.

అంతవరకూ ఆ పార్టీ పురోగతిని మెచ్చవచ్చు. ఇక సౌతిండియాలో బీజేపీకి పెద్దగా బలం లేదు అన్నది తెలిసిందే కర్నాటక లో ఈ రోజుకీ అధికారం చలాయిస్తున్నా పూర్తి మెజారిటీ ఏ రోజూ రాలేదు. కొన్ని సెక్టార్లలో
సెగ్మెంట్లలోనే బీజేపీకి బలం ఉంది. ఇక ఉమ్మడి ఏపీలో చూసినా విభజన తరువాత చూసినా తెలంగాణాలోనే కాస్తో కూస్తో బలం ఉంది.

అది కూడా కొన్ని సెగ్మెంట్లలో మాత్రమే. అలాంటి బీజేపీ ఏపీ గురించి పెద్ద కలలనే కంటోంది. కలలు కనాలి. కానీ దానికి కార్యాచరణ కూడా ఉండాలి. లేకపోతే అవి కల్లలుగానే మిగిలిపోతాయి. ఏపీలో చూస్తే బీజేపీ బలం ఎంత అంటే ఏ సర్వే లేకుండానే ఒక్క శాతానికి అటూ ఇటూ అని అంతా చెబుతారు. 2019 ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్ల శాతమే లభించింది.

మరి ఈ మూడున్నరేళ్ళలో బీజేపీ ఎదిగిందా అంటే అలా ఎదిగేందుకు ఏం చేసింది అన్నది కూడా ఆలోచించాలి కదా. ఏపీలో పోలవరం సహా అనేక విభజన హామీలు అలాగే ఉన్నాయి. పోనీ రాజకీయంగా బీజేపీ పటిష్టంగా ఉందా అంటే జనసేనతో పొత్తు అనుకున్నా అటు వైపు నుంచి సానుకూల సిగ్నల్స్ పెద్దగా లేని పరిస్థితే ఉంది. ఇక ఒంటరిగా పోటీ చేస్తాం అన్నీ గెలిచేస్తామని బీజేపీ పేరాశ పడితే గేలి చేసేవారే ఉంటారు తప్ప మరేమీ కాదు.

బీజేపీ పెద్దలు తాజాగా కొత్త ఆశలు పెంచుకుంటున్నారు. కొత్త కోరికల చిట్టాతో ముందుకు వస్తున్నారు. అదేంటి అంటే ఆ పార్టీ గోదావరి జోన్ లో నాలుగు ఎంపీ సీట్లను సులువుగా గెలుచుకునే పధక రచన చేస్తున్నారుట. గోదావరి జోన్ లో కాకినాడ, రాజమండ్రి, మచిలీపట్నం, నర్సాపురం లోక్ సభ సీట్లు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ నాలుగు సీట్లు గెలిచేసుకుని మోడీకి కానుకగా ఇవ్వాలని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు.

అంతదాకా ఆలోచన మంచిదే అయినా ముందే చెప్పుకున్నట్లుగా బీజేపీ బలం అక్కడ ఏపాటిది అన్నది కూడా చూడాలి కదా. ఈ నాలుగు సీట్లు ప్రస్తుతం వైసీపీ ఖాతాలో ఉన్నాయి, మరి ఈ సీట్లు గెలవాలనుకుంటున్న బీజేపీకి 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం కూడా ఒకసారి చూస్తే కాకినాడలో మొత్తం 12 లక్షలకు పైగా ఓట్లు పోల్ అయితే బీజేపీకి 9,596 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీనిని ఓట్ల షేర్ గా చూస్తే 0.78 శాతంగా చెప్పాలి.

ఇక రెండవది రాజమండ్రి లోక్ సభ సీటు. ఇక్కడా కూడా 12,334 ఓట్లు బీజేపీకి వచ్చాయి. అంటే దీన్ని 0.99 శాతంగా లెక్క వేయాల్సి. మరో వైపు మచిలీపట్నం లోక్ సభ సీట్లు చూస్తే బీజేపీకి వచ్చినవి 6 వేల 481 ఓట్లు మాత్రమే. ఇది బొత్తిగా తక్కువ అంటే 0.52 శాతం ఓట్లు మాత్రమే అన్న మాట. చివరిగా నరసాపురం లోక్ సభ స్థానానికి చూస్తే అక్కడ మాత్రమే కాస్తా ఎక్కువ ఓట్లు దక్కాయి. అంటే 12,414 అన్న మాట. ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లలో 1.05 శాతం వచ్చి బీజేపీ కొంచెం మెరుగు అనిపించుకుంది.

దానికి కారణం అప్పటికి బీజేపీ మంత్రిగా పనిచేసిన పైడికొండ మాణిక్యాలరావును పోటీకి పెట్టబట్టే అని అంటున్నారు. ఇలా కనుక చూసుకుంటే ఈ నాలుగు సీట్లలో కూడినా గట్టిగా నలభై వేల ఓట్లు మాత్రమే వచ్చాయన్న మాట. మరి ఈ నాలుగు చోట్ల పోల్ అయిన ఓట్లు అరవై నుంచి డెబ్బై లక్షలు ఉన్నాయి. మరి ఇంత దారుణంగా ఓట్లను బీజేపీ 2019 ఎన్నికల్లో తెచ్చుకుని కూడా జెండా ఎగరేస్తామని అంటోంది అంటే ఆ ధీమాను అతి గానే అంతా చూస్తున్నారు.

అయితే బీజేపీకి ఈ అత్యాశ కలగడానికి మరో రీజన్ ఉంది. అదేంటి అంటే రాజమండ్రీ, కాకినాడ, నర్సాపురం లలో బీజేపీ ఎంపీలు గతంలో గెలిచారు. అందువల్ల ఆ సీట్లు మళ్ళీ మాకే అనుకుంటోంది. కానీ ఆనాడు సినీ హీరో క్రిష్ణం రాజు పోటీ చేయడం వల్ల కాకినాడ దక్కింది. అలాగే టీడీపీ పొత్తులతో మళ్ళీ ఆ సీట్లు దక్కాయి. ఇలా గత చరిత్ర ఉంది. బలమైన అభ్యర్ధులు వాజ్ పేయ్ గ్లామర్ నాడు ఏపీకి బీజేపీ ఏదో చేస్తుంది అన్న ఆశలు అన్నీ కలసి ఆ గెలుపు సాధ్యమైంది. ఇపుడు బీజేపీ ఏపీకి చేస్తున్న నిర్వాకం చూశాక కూడా మోడీ గ్లామర్ కరిగిపోతున్న వేళ నాలుగు సీట్లు మావే అని గోదారి ఆశలతో గొంతెమ్మ కోరికలతో బీజేపీ నేతలు ఉంటే ఆలోచించాల్సిందే మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.