Begin typing your search above and press return to search.

విజయసాయికి అంత భారీ షాక్.. జగన్ మాత్రమే చేయగలరా?

By:  Tupaki Desk   |   20 April 2022 4:30 AM GMT
విజయసాయికి అంత భారీ షాక్.. జగన్ మాత్రమే చేయగలరా?
X
మాటలు చెప్పటం వేరు. చేతల్లో చూపించటం వేరు. ఎవరైనా సరే లెక్క తేడా వస్తే.. వెనుకా ముందు చూడకుండా చర్యలు తీసుకునే సాహసం చాలామంది అధినేతలు చేయరు. అందుకు భిన్నంగా కనిపిస్తారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. లెక్క తేడా వచ్చిందన్నంతనే వెనుకా ముందు చూసుకోకుండా పదవుల నుంచి పీకేయటం.. వారి స్థాయి.. స్థానం ఏమిటన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పటమే కాదు.. మిగిలిన వారికి బలమైన సంకేతాల్ని పంపటం జగన్ కు అలవాటుగా చెబుతారు.

కష్టంలో తనతో కలిసి ఉండి.. క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు తోడు ఉన్న విజయసాయికి జగన్ పెద్దపీట వేయటం తెలిసిందే. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన ప్రతి సందర్భంలో ఏదో ఒక వివాదం చోటు చేసుకోవటం.. అది పార్టీకి మైనస్ గా మారటమే కాదు.. జగన్ కు కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టటం రివాజుగా మారిందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొన్ని నెలల తర్వాత విజయసాయికి ఉన్న ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించినట్లుగా వాదనలు వినిపించాయి. ఇందుకు తగ్గట్లే పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ఆ తర్వాత మళ్లీ ప్యాచప్ కావటం.. ఆయనకు మరిన్ని పదవుల్ని అప్పజెప్పటం లాంటివి చేశారు. తాజాగా ఆయనపై వస్తున్న కంప్లైంట్లపై జగన్మోహన్ రెడ్డి కాస్తంత ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది. అనూహ్యంగా ఆయన్ను ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్త పదవి నుంచి పీకేసిన తీరు చూసినప్పుడు విస్మయానికి గురి చేస్తుంది. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రలో తిరుగులేని నేతగా చెలామణీ అవుతూ.. అక్కడి సీనియర్లు.. కొమ్ములు తిరిగిన మంత్రులకు సైతం విజయసాయి చూపించే హవా మింగుడుపడదని చెబుతారు.

ఇదే తీరు విజయసాయికి ఇప్పుడు శాపంగా మారిందంటున్నారు. ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం తెలిసిందే. పలు భూవివాదాలతో పాటు.. సెటిల్ మెంట్లు చేస్తారంటూ విపక్ష నేతలు అదే పనిగా ఆరోపిస్తున్న వేళలో.. విజయసాయిని కీలక పదవి నుంచి తప్పించటం చూస్తే.. పార్టీలోని మిగిలిన వారికి స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఇచ్చిన బాధ్యతను జాగ్రత్తగా చేపట్టాలే తప్పించి.. అనవసరమైన వివాదాల జోలికి వెళితే మాత్రం ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని తన చేతలతో జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారన్న మాట వినిపిస్తోంది. ఏమైనా ఇంతకాలం ఒక వెలుగు వెలిగిన విజయసాయి లాంటి వారికి.. కీలక పదవి నుంచి తప్పించటం మింగుడుపడని వ్యవహారంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.