Begin typing your search above and press return to search.

అంత పెద్ద స్థాయి ఐఏఎస్‌ ఆఫీసర్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో అరెస్ట్‌ అయ్యాడు!

By:  Tupaki Desk   |   11 Nov 2022 4:15 AM GMT
అంత పెద్ద స్థాయి ఐఏఎస్‌ ఆఫీసర్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసులో అరెస్ట్‌ అయ్యాడు!
X
21 ఏళ్ల యువతిని అత్యాచారం చేసిన కేసులో అండమాన్, నికోబార్‌ దీవుల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జితేంద్ర నరైన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముందస్తు బెయిల్‌ కోసం ఆయన స్థానిక కోర్టును ఆశ్రయించినప్పటికీ కోర్టులో జితేంద్ర నరైన్‌కు చుక్కెదురు అయ్యింది. దీంతో పోలీసులు ఆయన నివాసం ఉంటున్న ఓ ప్రైవేటు రిసార్టుకు వెళ్లి అరెస్టు చేశారు.

గ్యాంగ్‌ రేప్‌ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. జితేంద్ర నరైన్‌ అండమాన్, నికోబార్‌ దీవులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ఉద్యోగం ఇస్తానని చెప్పి 21 ఏళ్ల యువతిపై తన అధికారిక నివాసంలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు.

జితేంద్ర నరైన్‌ మాత్రమే కాకుండా మరో అధికారి కూడా 21 ఏళ్ల యువతిని అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఈ ఏడాది ఆగస్టులో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

స్వయంగా గ్యాంగ్‌ రేప్‌ కేసులో నిందితుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కావడంతో సీనియర్‌ ఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సిట్‌ జితేంద్ర నరైన్‌ను పలుమార్లు విచారించింది.

అనంతరం సిట్‌ ఇచ్చిన నివేదికతో కేంద్ర హోంశాఖ.. అప్పటికి ఢిల్లీ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్, ఎండీగా ఉన్న జితేంద్ర నరైన్‌ను విధుల నుంచి తొలగించింది.

తాజాగా స్థానిక కోర్టు కూడా ముందస్తు బెయిల్‌కు తిరస్కరించడంతో కోర్టు ఆదేశాల మేరకు జితేంద్ర నరైన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు.

కాగా జితేంద్ర నరైన్‌ 1990 ఐఏఎస్‌ బ్యాచ్‌ అధికారి. అరుణాచల్‌ ప్రదేశ్, మిజోరాం, గోవా, అండమాన్ నికోబార్‌ దీవుల క్యాడర్‌కు ఆయన ఎంపికయ్యారు.

అత్యాచారం ఆరోపణలపై సిట్‌ నివేదిక అందడంతో అక్టోబర్‌ 17న కేంద్ర హోం శాఖ ఆయనను పదవి నుంచి తప్పించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.