Begin typing your search above and press return to search.

పార్టీ మార్పుపై సుచరిత సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   6 Jan 2023 10:52 AM GMT
పార్టీ మార్పుపై సుచరిత సంచలన వ్యాఖ్యలు!
X
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత పార్టీ మార్పుపై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు స్పందించారు. తాను పార్టీ మారతానని.. టీడీపీ లేదా జనసేనల్లో చేరుతున్నట్టు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆమె హాట్‌ కామెంట్స్‌ చేశారు. తాను వైసీపీని వదిలి వేరే పార్టీలో చేరుతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించారు.

తాను ఉంటే వైసీపీలో ఉంటాను లేదంటే ఇంట్లో కూర్చుంటాను తప్ప మరే పార్టీలో చేరేది లేదని సుచరిత స్పష్టం చేశారు. తాజాగా భర్త ఎటు వైపు భార్య కూడా అటు వైపు నడవడం ధర్మమని.. భవిష్యత్తులో ఆయన ఎటు నడిస్తే తాను అటు నడుస్తానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై సుచరిత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను వైసీపీలో ఉంటానని స్పష్టం చేశారు.

మేకతోటి సుచరిత గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి మొదటిసారి 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌ వైసీపీ ఏర్పాటు చేశాక 2011లో వైసీపీలో చేరారు. ఆయనకు మద్దతుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2012 ఉప ఎన్నికలో ప్రత్తిపాడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2019లో వైసీపీ తరఫున సుచరిత విజయం సాధించారు.

మేకతోటి సుచరిత .. వైఎస్‌ జగన్‌ తొలి మంత్రివర్గ విస్తరణలో కీలకమైన హోంశాఖను దక్కించుకున్నారు. అయితే జగన్‌ రెండో మంత్రివర్గ విస్తరణలో ఆమె పదవి పోయింది.

మొదటి కేబినెట్‌ విస్తరణలో ఉన్న దళిత నేతలందరినీ కొనసాగించి తనను మాత్రమే తొలగించడంపై అప్పట్లో ఆమె కినుక వహించారు. మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో ఉన్న దళిత నేతలు ఆదిమూలపు సురేష్, నారాయణ స్వామి, తానేటి వనితను కొనసాగించి తనను మాత్రమే తొలగించడం పట్ల సుచరిత తీవ్ర మనస్తాపానికి గురయినట్టు వార్తలు వచ్చాయి. దీంతో సుచరితను వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు.

అయితే ఆమె ఆ పదవిలో అసంతృప్తిగానే ఉన్నారని టాక్‌ నడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవి నుంచి ఆమెను వైసీపీ అధిష్టానం తప్పించింది. ఆ బాధ్యతలను మాజీమంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ కు అప్పగించింది.

మరోవైపు ఆదాయపన్ను శాఖలో ఉన్నతాధికారిగా ఉన్న సుచరిత భర్త దయాసాగర్‌ ప్రస్తుతం పదవీవిరమణ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంపీ పదవికి పోటీ చేయొచ్చనే టాక్‌ నడుస్తోంది. అయితే వైసీపీలో కాకుండా టీడీపీలోకి వస్తారని.. టీడీపీ తరఫున బాపట్ల ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. సుచరిత సైతం వైసీపీకి గుడ్‌ బై చెప్పి టీడీపీలో చేరతారని టాక్‌ నడిచింది, ఈ వార్తలపై సుచరిత తాజాగా స్పష్టత ఇచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.