Begin typing your search above and press return to search.

బీటెక్ బాబుల‌కో స‌ల‌హా!

By:  Tupaki Desk   |   26 Jun 2017 9:53 AM GMT
బీటెక్ బాబుల‌కో స‌ల‌హా!
X
ఇంజినీరింగ్ విద్యార్థులంటే ఒక‌ప్పుడు ఉన్న క్రేజ్ వేరు. ఇలా బీటెక్‌ డిగ్రీ పూర్తి అవుతూనే అలా క్యాంపస్ కొలువులు వ‌చ్చేవి. ఊరించే రంగం అయిన ఐటీ సెక్టార్ లో ఉద్యోగాల ఆఫ‌ర్ లెట‌ర్లు ఇచ్చి ప‌లు దిగ్గ‌జ కంపెనీలు చివ‌రి సంవ‌త్స‌రంలోనే విద్యార్థుల‌ను ఎగ‌రేసుకొని వెళ్లేవి. అయితే ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. ఐటీ రంగాన్ని అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప‌రిణామాలు - టెక్నాల‌జీలు రోజు రోజుకూ వ‌స్తున్న మార్పులు తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్నాయి. ఒకే టెక్నాల‌జీ మీద కొన్నేళ్లు వ‌ర్క్ చేయాల‌నే దోర‌ణి మారిపోయింది. కొత్త కొత్త టెక్నాల‌జీల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అంది పుచ్చుకుంటూ ఉండని వారిని నిర్దాక్షిణ్యంగా తొల‌గించేస్తున్నారు.

ఐటీ సెక్టార్ లోని ఉద్యోగుల్లో ఎక్కువ‌గా ఉండేది బీటెక్ గ్రాడుయేట్లే. ఓ అంచ‌నా ప్ర‌కారం ప్ర‌తి సంవ‌త్స‌రం ఇంజ‌నీరింగ్ డిగ్రీ పాసయ్యే వాళ్లు ఇండియాలో దాదాపు 10 ల‌క్ష‌ల మంది. తెలుగు రాష్ర్టాల్లోనే ఏటా సుమారుగా 75 వేల మంది బీటెక్ ప‌ట్ట‌భ‌ద్రులు బ‌య‌ట‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇండ‌స్ట్రీలో స‌ప్లై పెరిగిపోయి.. డిమాండ్ త‌గ్గింది. అందుకే గ‌తంలో అంటే సాగిపోయింది కానీ.. భ‌విష్య‌త్తులో ఒక్క బీటెక్ డిగ్రీ మాత్ర‌మే ఉంటే ఐటీ జాబ్స్ కొట్ట‌డం క‌ష్ట‌మే. మ‌రోవైపు గ‌త ఐదారేళ్లుగా ఫ్రెష‌ర్స్ సాల‌రీస్ అంత ఆశాజ‌న‌కంగా లేవు. దీంతో ఐటీ ఇండ‌స్ట్రీపై మున‌ప‌టి మోజు త‌గ్గుతోంది. దీనికి కార‌ణం ఐటీ ఇండ‌స్ట్రీలో వ‌చ్చే ఆటుపోట్లే!

అందుకే ఐటీలో జాబ్స్ కోరుకునే బీటెక్ బాబులు ఇప్ప‌టికే పెద్ద ఎత్తున నియామ‌కాలు త‌గ్గిపోయిన నేప‌థ్యంలో ``కేవ‌లం బీటెక్ మాత్ర‌మే చ‌ద‌వ‌కండి. ఏదో ఒక స్పెష‌లైజేష‌న్ తో ఎంటెక్ కూడా చేయండి. కోడింగ్ ప‌రిజ్ఞానాన్ని పెంచుకోండి. భ‌విష్య‌త్తులో కంపెనీలు కోడింగ్ నాలెడ్జ్ ను ప‌రిగ‌ణ‌న‌లోని తీసుకొనే రిక్రూట్ చేసుకుంటాయి` అని నిపుణులు వివ‌రిస్తున్న సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క ఫాలో కావాల్సిందే. గ‌త నాలుగైదేళ్ల క్రితం వ‌ర‌కు సాగిన‌ట్లు ఫ్రెష‌ర్స్ ను రిక్రూట్ చేసుకొని... ఓ ఆరు నెల‌లు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు ప్రాజెక్ట్స్ మీద కూర్చోబెట్టే ప‌ద్ధ‌తికి త్వ‌ర‌లోనే కార్పోరేట్ కంపెనీలు మంగ‌ళం పాడ‌నున్నాయి. ఇక కంపెనీలు ప్రెష‌ర్స్ పై టైమ్ వేస్ట్ చేయ‌ద‌ల‌చ‌లేద‌ని.. కోడింగ్ ప‌రిజ్ఞానం ఉన్న వారినే తీసుకోవ‌డానికి ఆస‌క్తి చూపిస్తున్నాయ‌ని ఇండ‌స్ర్టీ వ‌ర్గాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. సో ఇప్పుడు ఇంట్లో కూర్చోవాలా లేదా ఇంట్రెస్ట్ పెంచుకొని కొత్త నైపుణ్యాలు నేర్చుకొని కొలువులు సంపాదించుకోవాలా అనేది బీటెక్ బాబుల చేతుల్లోనే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/