Begin typing your search above and press return to search.

కావేరి చిచ్చు.. లైవ్ లో దారుణం!

By:  Tupaki Desk   |   16 Sep 2016 7:25 AM GMT
కావేరి చిచ్చు.. లైవ్ లో దారుణం!
X
కావేరీ జలాల పంపిణీ విషయంలో సుప్రీం కోర్టు ఉత్తర్వ్యుల అనంతరం తమిళనాడు - కర్ణాటకల మధ్య రాజుకున్న నిప్పు ఇప్పట్లో చల్లారేలా లేదు. రాజకీయ నాయకులు - మేధావులూ - కోర్టుల మధ్య ఉండాల్సిన విషయం ప్రజల్లోకి రావడంతో చివరికి వారంతా బలికావాల్సి వస్తుంది. ఇప్పటికే ఈ విషయంపై సుప్రీం కోర్టు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకూ చురకలు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆవేశానికో - ఆగ్రహానికో లోనైన ఒక రాజకీయ పార్టీ కార్యకర్త లైవ్ లో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

కర్ణాటకలో తమిళ ప్రజల మీద దాడులు చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ.. తమిళ నటుడు - రాజకీయ నాయకుడు సిమాన్ స్థాపించిన నామ్ తమిళర్ కట్చి పార్టీ కార్యకర్తలు చెన్నై నగరంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న ఆ పార్టీ కార్యకర్త విఘ్నేష్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ విషయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకున్నాడో ఏమో కానీ... తాను ఆత్మహత్య చేసుకోబోతున్న విషయాన్ని ముందుగానే ఫేస్ బుక్ లో ప్రకటించాడు విఘ్నేష్! తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, మీరు వచ్చి ఆ దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తే మీ టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందని టీవీ చానళ్లకు ఫేస్ బుక్ ద్వారా సమాచారం ఇచ్చిన ఇతడు.. స్నేహితులకు కూడా సమాచారం అందించాడు. అయితే ఇదేదో ఆకతాయి చర్యగా భావించిన వారు సీరియస్ గా తీసుకోలేదు. కానీ.. ధర్నా జరుగుతున్న చోట ఈ వ్యక్తి మాత్రం ఒంటిమీద పెట్రోల్ పోసుకుని అన్నంతపనీ చేశాడు.

కాగా... కావేరీ జలాల పంపిణి విషయంలో కర్ణాటక - తమిళనాడు ప్రజల మధ్య విభేదాలు రోజురోజుకీ ముదిరిపాకాన పడుతున్నాయి. ఈ కారణంతోనే తమిళనాడులోని తంజావూర్ సమీపంలోని మణ్ణార్ గుడిలో నివాసం ఉంటున్న విఘ్నేష్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసుల ప్రాథమిక విచారణ అనంతరం వెల్లడించారు.