Begin typing your search above and press return to search.

సౌదీలోనూ ఆత్మాహుతి దాడి

By:  Tupaki Desk   |   4 July 2016 5:58 AM GMT
సౌదీలోనూ ఆత్మాహుతి దాడి
X
ఇక్కడా.. అక్కడా అన్న తేడా లేకుండా ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు.ఇంతకాలం కొన్ని దేశాల మీద ఏ మాత్రం తమ పడగనీడ పడని ముస్లిం దేశాల్లోనూ ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ తో మొదలైన సరికొత్త మారణకాండ రోజుకో దేశం చొప్పున దుర్మార్గపు దాడికి పాల్పడటం గమనార్హం. టర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ దగ్గర విచక్షణారహితంగా కాల్పులు జరిపి.. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రచర్య అనంతరం.. తమ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీద ఉగ్రవాదులు తమ పంజా విసిరారు.

ఇక్కడా మారణహోమాన్ని సృష్టించిన వారు.. ఆదివారం ఇరాక్ రాజధాని బగ్దాద్ లో శక్తివంతమైన ఆత్మాహుతి దాడికి పాల్పడి దాదాపు 172 మందిని పొట్టనబెట్టుకున్నారు. మరికొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వరుసగా జరుగుతున్నఈఆత్మాహుతి దాడులతో షాక్ తింటున్న వారు తేరుకోక ముందే మరో ఉగ్రదాడి చోటు చేసుకోవటం గమనార్హం.

ఉగ్రవాదుల కన్ను ఈసారి సౌదీ అరేబియా మీద పడటం గమనార్హం.ఇప్పటివరకూ మిగిలిన దేశాల సంగతి ఎలా ఉన్నా.. సౌదీవైపు దృష్టి సారించని ఉగ్రవాదులు.. ఇప్పుడా దేశాన్ని కూడా వదిలిపెట్టేది లేదన్న విషయం తాజా దాడితో స్పష్టమైందని చెప్పొచ్చు. సౌదీలోని జెడ్డా సిటీలోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ ఉదయం ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ పేలుడులో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలైనట్లు చెబుతున్నారు. మరోవైపు.. సౌదీ భద్రతాదళాలు ఓ సూసైడ్ బాంబర్ ను అదుపులోకి తీసుకొని బాంబును నిర్వీర్యం చేయటంతో పెను ప్రమాదం తప్పింది.

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం రోజునే అమెరికా కాన్సులేట్ వద్ద ఈ దాడి చోటు చేసుకోవటం గమనార్హం. తాజా దాడి నుంచి అమెరికా కాన్సులేట్ అధికారులు.. సిబ్బంది సురక్షితంగా బయటపడటంతో పెద్ద గండం తప్పినట్లుగా భావిస్తున్నారు. తాజా ఆత్మాహుతి దాడితో సౌదీఅరేబియా హైఅలెర్ట్ ప్రకటించింది. ఈ దాడికి బాధ్యులు ఎవరన్న సమాచారం ఇంకా బయటకు రాలేదు.