Begin typing your search above and press return to search.

అప్పు త‌ప్పుకాదు...ఈడీదే తప్పు..సుజ‌నా క్రేజీ క్లారిటీ

By:  Tupaki Desk   |   25 Nov 2018 5:39 PM GMT
అప్పు త‌ప్పుకాదు...ఈడీదే తప్పు..సుజ‌నా క్రేజీ క్లారిటీ
X
డొల్ల కంపెనీల పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు టీడీపీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి వ్యాపార సంస్థలు, ఇళ్లలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని సుజనా చౌదరికి సమన్లు కూడా జారీ చేశారు. తన పై వచ్చిన ఆరోపణలు, ఈడీ దాడుల పై సుజనా చౌదరి స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాల పై వివరణ ఇచ్చారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకే కేంద్రం తన పై ఈడీ దాడులు చేయించిందని సుజనా చౌదరి ఆరోపించారు. తనకు ఎలాంటి విలువైన కార్లు, భవనాలు లేవని, తాను ఫోర్జరీలు, స్మగ్లింగ్ చేయలేదని చెప్పారు.

బ్యాంకులను మోసం చేశానంటూ ఈడీ చేసిన ప్రకటన బాధ్యతారాహిత్యంగా ఉందని సుజనా మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీ, హైదరాబాద్‌లలోని కార్యాలయాలు, ఇంటికి ఈడీ అధికారులు వచ్చారని.. ఒక అనధికార కంపెనీ తో తనకు సంబంధం ఉందని ఆరోపిస్తూ వచ్చిన అధికారులు.. కొన్ని పేపర్లను పట్టుకుని వెళ్లారని సుజనా చెప్పారు. రూ.5700 కోట్లు అని ఒక్క రోజు సోదాలతో ఎలా తేలుస్తారని ప్రశ్నించారు. తన ఆస్తుల విలువ అప్పు కంటే ఎక్కువగా ఉంటుందన్న సుజనా.. ఈడీ తొందరబాటుగా ప్రకటన ఇచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు. తన కంపెనీలకు సంబంధించిన వ్యవహారాలన్నీ పారదర్శకంగానే ఉన్నాయన్నారు. 30 ఏళ్ల క్రితం రెండు కంపెనీలను స్థాపించానని, 2010లో అన్ని కంపెనీల పదవులకు రాజీనామా చేశానని ఆయన పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్నందున తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తన పై ఉందన్నారు. టీడీపీలో క్రియాశీలకంగా మారేంతవరకు తనపై ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. తన కంపెనీలకు సంబంధించిన అన్ని వివరాలు వెబ్‌సైట్‌ లో ఉన్నాయని సుజనా తెలిపారు. తాను స్థాపించిన కంపెనీల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని వివరించారు. తన కంపెనీలు స్మగ్లింగ్ చేయలేదన్న సుజనా.. 2015వరకు కూడా బ్యాంకు రుణాలకు వడ్డీలన్నీ చెల్లించినట్టు తెలియజేశారు. 29ఏళ్ల నుంచి కంపెనీలకు సంబంధించిన అన్ని రిటర్న్స్ దాఖలు చేశానన్నారు. నాలుగైదేళ్లుగా స్టీల్ కంపెనీ పనితీరు ఆశాజనకంగా లేదన్నారు.

తాను ఎలాంటి అవినీతికీ పాల్పడలేదని సుజ‌నాచౌద‌రీ స్పష్టం చేశారు. నాగార్జున హిల్స్‌లోని భవనంతో తనకు సంబంధం లేదన్న సుజనా.. బ్యాంకుల నుంచి అప్పు తీసుకోవడం తప్పు కాదు కదా అని ప్రశ్నించారు. తన కంపెనీలకు సంబంధించినవన్నీ పారదర్శకంగా ఉన్నాయని, డమ్మీ కంపెనీలతో తనకు సంబంధం లేదని సుజనా చెప్పారు. తన ఇంట్లో ఉన్న కార్లు తన కుటుంబానికి సంబంధించినవేనని.. అవి బినామీల పేర్లతో ఉన్నాయని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. 30ఏళ్ల క్రితం తాను సుజనా యూనివర్స్‌ల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, సుజన మెటల్ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్ అనే రెండు కంపెనీలను స్థాపించానని సుజనా చెప్పారు. సుమారు 11 సంవత్సరాల క్రితం ఒక కంపెనీ నుంచి విడిపోయి మూడో కంపెనీ వచ్చిందని.. గత 29 ఏళ్ల నుంచి ఈ కంపెనీల వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయన్నారు. 29ఏళ్లు తన కంపెనీలు సక్రమంగానే ఆడిట్‌ నిర్వహించాయని.. డమ్మీ కంపెనీలంటే ఏంటో తనకు తెలియదని సుజనా చెప్పారు.

తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ఫిర్యాదు చేస్తానని సుజ‌నా చౌద‌రి హెచ్చరించారు. ``సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉంటే వాటికి పెనాల్టీ వేసి కట్టించుకోవచ్చు. నాకున్న స్టీల్‌ ప్లాంట్‌లో భారీ నష్టం వాటిల్లింది. వాటి జోలికి ఈడీ ఎందుకు వెళ్లలేదు?' అని సుజనా ప్రశ్నించారు. బెస్ట్ అండ్ క్రాంప్టన్‌పై ఫిర్యాదు వచ్చింది అని ప్రెస్‌ నోట్‌లో ఇచ్చారని.. కానీ ఆ కంపెనీతో తనకు సంబంధం లేదని చెప్పారు. రామచంద్రయ్య వ్యాఖ్యలు పై ఆయన విజ్ఞతకు వదిలేస్తానన్న సుజనా.. అడ్డంగా వాదించే నాయకులను పట్టించుకోనని అన్నారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నందు వల్లే తనపై దాడులు జరుగుతున్నాయని సుజనా చెప్పారు. 29 ఏళ్లుగా తాను క్రమం తప్పకుండా ఆదాయ పన్ను కడుతున్నానని తెలిపారు. ఈడీ దాడులపై న్యాయ సలహా తీసుకుంటానన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తర్వాతే ఈడీ ఎదుట విచారణకు హాజరవుతానని సుజనా చౌదరి స్పష్టం చేశారు.