Begin typing your search above and press return to search.

రాజ‌ధానిపై సుజ‌నా చౌద‌రికి సీఎం ర‌మేశ్ కౌంట‌ర్!

By:  Tupaki Desk   |   30 Dec 2019 6:23 AM GMT
రాజ‌ధానిపై సుజ‌నా చౌద‌రికి సీఎం ర‌మేశ్ కౌంట‌ర్!
X
ఏపీ రాజ‌ధాని విష‌యంలో ఏం మాట్లాడాలో.. భార‌తీయ జ‌న‌తా పార్టీకే అర్థం అవుతున్న‌ట్టుగా లేదు. ఆ పార్టీ నేత‌లు త‌లా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. రాజ‌ధాని విష‌యంలో సీఎం జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను ముందుగా స్వాగ‌తించింది భార‌తీయ జ‌న‌తా పార్టీ వాళ్లే. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఎంపీలు త‌లా ఒక ర‌కంగా మాట్లాడుతూ ఉన్నారు.

ఆ క్ర‌మంలో బీజేపీ నేత‌లే ఒక‌రి మీద మ‌రొక‌రు కౌంట‌ర్ కామెంట్లు చేయ‌డం మొద‌లైన‌ట్టుగా ఉంది. ఇటీవ‌లే భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరిన ఇద్ద‌రు ఎంపీలు ఒక‌రితో మ‌రొక‌రు విబేధించుకుంటూ మాట్లాడారు. ముందుగా రాజ‌ధాని అంశంపై సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ.. అమ‌రావ‌తి నుంచి అంగుళం మార్చినా కేంద్రం ఊరుకోదంటూ ప్ర‌క‌ట‌న చేశారు. అమ‌రావ‌తి విష‌యంలో సుజ‌నా చౌద‌రి ఇప్ప‌టికే ప‌లు సార్లు స్పందించారు. ఆయ‌న అక్క‌డ భారీగా భూముల‌ను కొనుగోలు చేశార‌ని - అందుకే అలా మాట్లాడుతూ ఉన్నార‌ని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. త‌న‌కు భూములు ఉంటే చూపాలంటూ సుజ‌నా స‌వాల్ విసిరారు. దానికి ప్ర‌తిగా వైసీపీ ఒక జాబితాను విడుద‌ల చేసింది. ఆ త‌ర్వాత సుజ‌నా చౌద‌రి పెద్ద‌గా స్పందించ‌లేదు.

ఆ సంగ‌త‌లా ఉంటే.. మ‌ళ్లీ ఇప్పుడు సుజ‌నా చౌద‌రి స్పందించారు. అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని మార్చ‌డానికి స‌సేమేరా అన్నారు. ఇలాంటి క్ర‌మంలో ఈ అంశంపై సుజ‌నాతో పాటే తెలుగుదేశం నుంచి వెళ్లి బీజేపీలోకి చేరిన సీఎం ర‌మేశ్ స్పందించారు. రాజ‌ధాని విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం కేవ‌లం సూచ‌న‌లు మాత్ర‌మే చేస్తుంద‌ని సీఎం ర‌మేశ్ అంటున్నారు. రాజ‌ధాని ఎక్క‌డ అనే విష‌యంలో కేంద్రం జోక్యం చేసుకోద‌ని - అది రాష్ట్రాల విష‌యం అని ఈ క‌మ‌లం పార్టీ నేత అన్నారు.

అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని మారిస్తే కేంద్రం ఒప్పుకోద‌న్న‌ట్టుగా సుజ‌నా చౌద‌రి అంటే.. రాజ‌ధాని విష‌యంలో కేంద్రానికి కేవ‌లం స‌ల‌హా పాత్రే అని సీఎం ర‌మేశ్ అంటున్నారు. ఇలా బీజేపీలోకి చేరిన ఈ నేత‌లు ఒక‌రితో ఒక‌రు విబేధించిన‌ట్టుగా స్పందించారు. అస‌లు బీజేపీకే ఈ విష‌యంలో ఒక స్ప‌ష్ట‌త ఉన్న‌ట్టుగా లేదు. ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రి మాట‌లు మ‌రింత విరుద్ధంగా ఉన్నాయి.