Begin typing your search above and press return to search.

సుజనా - కామినేని - నిమ్మగడ్డ రహస్య మీటింగ్ కథేంటి?

By:  Tupaki Desk   |   23 Jun 2020 6:30 AM GMT
సుజనా - కామినేని - నిమ్మగడ్డ రహస్య మీటింగ్ కథేంటి?
X
ఇప్పుడు బీజేపీలో ఉన్న వారంతా పాత టీడీపీ నేతలే. సన్నిహిత సంబంధాలు ఉన్నవారే.. బీజేపీలోకి సుజనా చౌదరి - కామినేని శ్రీనివాసరావులు పోయినా మనసంతా చంద్రబాబు చుట్టూనే తిరుగుతుంటుంది. బీజేపీలో చేరాక కూడా చంద్రబాబుపై ఈగ వాలనీయకుండా కాపుకాస్తుంటాడనే పేరు సుజనా చౌదరికి ఉందంటారు. టీడీపీకి మొదట ఆర్థిక అండగా ఉన్న ఆయన బాబు ఓడిపోగానే మోడీ పంచన చేరాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. అయినా ఇప్పటికీ సుజనా మనసు టీడీపీపైనే ఉంటుందంటారు. బాబుకు - టీడీపీకి ఏమైనా జరిగితే తను బీజేపీలో ఉన్న సంగతి కూడా మర్చిపోయి మీడియా ముందు రచ్చ చేస్తుంటాడు సుజనా అనే అపవాదు ఉంది.

అయితే తాజాగా ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జగన్ ప్రభుత్వం చేత తొలగించబడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం సెగలు కక్కుతోంది. ఆయన ఇష్యూ సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. తిరిగి నియమించాలని జగన్ ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రస్తుతం విచారణ సాగుతోంది. కానీ సీఎం జగన్ మాత్రం ఆయన నియామకాన్ని సహించడం లేదు. టీడీపీకి ఫేవర్ గా నిమ్మగడ్డ పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

నిమ్మగడ్డ వ్యవహారం పీక్ స్టేజీలో ఉండగానే తాజాగా హైదరాబాద్ లో జరిగిన మంత్రాంగం చర్చనీయాంశమైంది. తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖ పార్క్ హయాత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేశ్ తాజాగా బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి - మాజీ మంత్రి - బీజేపీ నేత కామినేని శ్రీనివాసరావుతో గంటన్నర సేపు జరిపిన రహస్య భేటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పార్క్ హయాత్ హోటల్ లోని 8వ అంతస్థు గదిలో ఈ సమావేశం జరిగినట్టు వీడియోలను బట్టి తెలుస్తోంది. ఈనెల 13న ఉదయం బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి పార్క్ హయాత్ హోటల్ లోకి ఎంటర్ అయ్యాడు. ఆయన తర్వాత అరగంటకు మాజీమంత్రి కామినేని కూడా ఇదే పార్క్ హయత్ హోటల్ కు వచ్చారు. వీరిద్దరి తర్వాత చివర్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హోటల్ కు వచ్చారు. వీరు ముగ్గురు వేర్వేరు లిఫ్టుల ద్వారా 8వ అంతస్తులోకి చేరుకున్నారు. కానీ ముగ్గురిని ఒకే వ్యక్తి రిసీవ్ చేసుకోవడం వీడియోలో కనిపించింది. ముగ్గురు ఒకే గదిలోకి వెళ్లడం సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించింది.

నిమ్మగడ్డ - సుజనా - కామినేనిలు ఒకే గదిలో దాదాపు గంట పాటు ఈ రహస్య మీటింగ్ నిర్వహించారు. మొదట కామినేని ఆ గది నుంచి బయటపడగా.. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ బయటకు వచ్చారు. చివర్లో హొటల్ నుంచి సుజనా చౌదరి చల్లగా జారుకున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో కనిపించాయి.

ఈ ముగ్గురిలో ఒకరు వైసీపీని ఎదురిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ..మిగిలిన ఇద్దరూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాప్రతినిధులు. సుప్రీం కోర్టులో నిమ్మగడ్డ వ్యవహారంపై విచారణ సాగుతున్న వేళ ఈ ముగ్గురు రహస్య భేటి జరపడంపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ద పదవిలో ఉండి ఇలా నిమ్మగడ్డ రమేష్ ఇలా రాజకీయ పార్టీ నేతలతో మీటింగ్ లు పెట్టడం ఏంటని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారు? బీజేపీ నేతలతో నిమ్మగడ్డ ఎందుకు చర్చ జరపాల్సి వచ్చింది? బీజేపీని మచ్చిక చేసుకోవడానికి నిమ్మగడ్డ ఇలా చేశాడా అని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఇలాంటి మీటింగ్ తో నిమ్మగడ్డ ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని ప్రశ్నిస్తున్నారు.