Begin typing your search above and press return to search.

ఆ చప్పట్లు కొట్టుడేంది సుజనా?

By:  Tupaki Desk   |   6 Aug 2016 4:38 AM GMT
ఆ చప్పట్లు కొట్టుడేంది సుజనా?
X
కేంద్ర మంత్రి సుజనా చౌదరి తప్పులో కాలేశారు. తెలిసి చేశారో.. తెలియక చేశారో కానీ.. ఆయన్ను జీవితాంతం వేలెత్తి చూపించేలా ఒక తప్పు చేశారు. తాజాగా ఏపీలో తీవ్రస్థాయిలో ఉన్న ప్రత్యేకహోదా అంశంపై రాజ్యసభలో జరుగుతున్న చర్చ సందర్భంగా సుజనా పెద్ద తప్పునే చేశారు. ఏపీ కాంగ్రెస్ కు చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏపీ ప్రత్యేక హోదాపై ప్రైవేటుబిల్లు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన పెట్టిన ప్రైవేటు బిల్లుతో రాజుకున్న సెంటిమెంట్ రోజురోజుకీ పెరగటంతోపాటు.. అధికార టీడీపీ.. బీజీపీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

శుక్రవారం కేవీపీ బిల్లుపై ఓటింగ్ జరగాల్సిన ఉన్న సమయంలో.. కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లు ఆర్థికమైనదని.. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఓటింగ్ కు కుదరదని.. దీన్ని లోక్ సభకు పంపటం మినహా మరో మార్గం లేదంటూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ అభిప్రాయ పడిన వేళ.. కాంగ్రెస్ సహా పలువురు నేతలు ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లును లోక్ సభకు పంపుతున్నట్లుగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయాన్ని వెల్లడించిన వెంటనే విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వేళ.. కేంద్రమంత్రి సుజనా చౌదరి చప్పట్లు కొట్టటం వివాదాస్పదంగా మారింది.

రాజ్యసభలో బలం లేని బీజేపీ.. కేవీపీ ప్రైవేటుబిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరిగితే.. అందులో కానీ ఓటమి చెందితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలా అని కేవీపీ బిల్లు ఆమోదం పొందాలని అస్సలు అనుకోని నేపథ్యంలో.. ఆ ముప్పును తప్పించుకునేందుకు కేవీపీ ప్రైవేటు బిల్లును లోక్ సభకు పంపటం ద్వారా.. తనకు ఎదురయ్యే ఇబ్బందుల్ని అధిగమించాలన్న ఉద్దేశంతోనే బిల్లును లోక్ సభకు బదిలీ చేస్తున్నట్లుగా చెప్పొచ్చు.

కేవీపీ బిల్లు లోక్ సభకు పంపిన పక్షంలో.. అక్కడ ఏన్డీయేకు సంపూర్ణ మెజార్టీ ఉండటంతో వ్యూహాత్మకంగానే ప్రభుత్వం బిల్లును లోక్ సభకు పంపేలా పావులు కదిపించిందని చెప్పొచ్చు. ఏపీ ప్రయోజనాల్ని తీవ్రంగా ప్రభావితం చేసే ఈ పరిణామం చోటు చేసుకున్నప్పుడు ఆవేశంతో విరుచుకుపడాల్సిన సుజనా అండ్ కో.. అందుకు భిన్నంగా చప్పట్లు కొట్టటం పలువురు తప్పు పడుతున్నారు.

ఇదే విషయం మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్పందిస్తూ.. సుజనా చౌదరి తెలిసో తెలియకో అలాంటి తప్పు చేసి ఉంటారని.. చప్పట్లు కొట్టటం తప్పు అని ఒప్పేసుకున్న పరిస్థితి. మరోవైపు.. తాను చప్పట్లు కొట్టలేదని.. తనను రాజకీయంగా దెబ్బ తీయటానికే ఇలాంటి ప్రచారాన్ని విపక్షాలు మొదలెట్టాయంటూ సుజనా కవర్ చేసుకోవటం గమనార్హం.