Begin typing your search above and press return to search.

సుజ‌నాను సీబీఐ వ‌దిలేలా లేదే!

By:  Tupaki Desk   |   30 April 2019 4:24 AM GMT
సుజ‌నాను సీబీఐ వ‌దిలేలా లేదే!
X
టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుజ‌నా చౌద‌రికి కష్టాలు మ‌రింత‌గా తీవ్ర‌మ‌వుతున్న‌ట్లుగానే క‌నిపిస్తోంది. తానేమీ త‌ప్పు చేయ‌కున్నా కూడా సుజ‌నా ఇప్పుడు విచార‌ణ‌ల పేరిట సీబీఐ ముందు హాజ‌రు కాక త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఓ సంస్థ... తాను తీసుకున్న రుణాన్ని స‌క్ర‌మంగా చెల్లించ‌ని కార‌ణంగా ఆ రుణానికి షూరిటీ ఇచ్చిన పాపానికి ఇప్పుడు సుజ‌నా విచార‌ణ సంస్థ‌ల ముందు విచార‌ణ‌కు హాజ‌రు కాక త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఈ కేసు అస‌లు వివ‌రాల్లోకి వెళితే... బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థ ఆంధ్రా బ్యాంకు వ‌ద్ద రుణం తీసుకుంది. ఈ రుణానికి సుజ‌నా ష్యూరిటీ ఇచ్చిన‌ట్లుగా ఆరోప‌ణ‌లున్నాయి. ఈ ఆరోప‌ణ‌ల మీద‌నే సుజ‌నాపై ఆంధ్రా బ్యాంకు సీబీఐని ఆశ్ర‌యించింది. ఆ త‌ర్వాత ఈ కేసు కోర్టు గ‌డ‌ప కూడా తొక్కింది. ఈ క్ర‌మంలో స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా సుజ‌నా ఇల్లు - ఆఫీసుల్లో సోదాలు చేసిన సీబీఐ అధికారులు... విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ సుజ‌నాకు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ 26న బెంగళూరు సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలంటూ ఆయ‌న‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే ఆ విచారణకు సుజనా వెళ్లలేదు. ఈ క్ర‌మంలోనే సీబీఐ వైఖ‌రిపై న్యాయ‌పోరాటానికి దిగిన సుజ‌నా ఏకంగా తెలంగాణ హైకోర్టును ఆశ్ర‌యించారు.

త‌న‌కు సంబంధం లేని విష‌యంలో త‌న‌న‌ను ఇబ్బందులు పెట్టేందుకే సీబీఐ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం ఈ పిటిష‌న్ పై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. కోర్టులో విచార‌ణ జ‌రుగుతున్న నేప‌థ్యంలోనే మొన్న‌టి సీబీఐ విచార‌ణ‌కు సుజ‌నా హాజ‌రుకాలేద‌ని తెలుస్తోంది. అయితే ఇవేవీ ప‌ట్ట‌ని సీబీఐ మ‌రోమారు సుజ‌నాకు నోటీసులు జారీ చేసింది. వ‌చ్చే నెల 4న త‌మ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆ నోటీసుల్లో సుజ‌నాను కోరింది. అయితే ఇప్ప‌టికీ హైకోర్టులో వేసిన పిటిష‌న్ పై విచార‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈ సారి విచార‌ణ‌కు అయినా హాజ‌రవుతారా? అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ ద‌ఫా విచార‌ణ‌కు హాజ‌రు కాకుంటే... సీబీఐ అధికారులు సుజ‌నాను అరెస్ట్ చేసినా ఆశ్చ‌ర్యం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.